అధిష్టానంపై ఒత్తిడి.. రేపు గాంధీ భవన్ ముందు బీసీల నిరసన
మొదటి విడతలో 72 స్థానాలు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయని, అందులో కనీసం 10 మంది బీసీలకు కూడా స్థానంలేదనే సమాచారం కూడా తమకు ఉందని అంటున్నారు బీసీ నేతలు. అదే నిజమైతే.. బీసీ వర్గాల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంచాయితీ ఇంకా తేలలేదు. ఓవైపు సీట్లు అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తుంటే, మరోవైపు బీసీలు తమకి 34 సీట్లు కావాల్సిందేనంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా తిరుగుబాటు తప్పదంటున్నారు. తాజాగా గాంధీ భవన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టేందుకు రెడీ అయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు బీసీ ఆశావహులంతా గాంధీ భవన్ ముందు ఆందోళన చేస్తారని చెప్పారు ఓబీసీ కాంగ్రెస్ నేత కత్తి వెంకట స్వామి.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..?
బీసీలకు సముచిత స్థానం ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్.. 34 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు నేతలు. ఆమధ్య వి.హనుమంతరావు ఆధ్వర్యంలో కొంతమంది నేతలు అధిష్టానాన్ని కలసి విన్నపాలు వినిపించారు. కానీ బతిమిలాడుకుంటే ఇది తెగే సమస్య కాదని, నిరసన స్వరం వినిపిస్తేనే అధిష్టానం చెవికెక్కుతుందని అంటున్నారు మరికొందరు. ఆ రెబల్ నేతలే రేపు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. టికెట్ల విషయంలో ఎవరెవరి డిమాండ్స్ ఎన్ని ఉన్నా తమందరి లక్ష్యం కాంగ్రెస్ గెలుపే అని బీసీ నేతలంటున్నారు. ఓబీసీలు కాంగ్రెస్ అండగా ఉంటామని, అదే సమయంలో 34 సీట్లకు తగ్గితే.. తాము తగ్గేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు.
ఓబీసీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నప్పుడే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు సులువు అవుతాయని చెబుతున్నారు బీసీ నేతలు. మొదటి విడతలో 72 స్థానాలు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయని, అందులో కనీసం 10 మంది బీసీలకు కూడా స్థానంలేదనే సమాచారం కూడా తమకు ఉందని అంటున్నారు. అదే నిజమైతే.. బీసీ నేతల్లో అభద్రతా భావం ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటికే బయట పార్టీ నుండి చేరే వ్యక్తుల వల్ల తమకు నిరాశ ఏర్పడుతోందని.. బీసీలకు సమూచిత స్థానం ఇవ్వకపోతే పార్టీ ఓడిపోతుందని అంటున్నారు. రేపు గాంధీ భవన్ ముందు బీసీల నిరసనను అధిష్టానం ఏమేరకు పట్టించుకుంటుందో చూడాలి.