18 నుంచి బీసీల స్థితిగతులపై విచారణ
బీసీ కమిషన్ సమావేశంలో నిర్ణయం
బీసీ కులాల స్థితిగతులపై ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు బహిరంగ విచారణ చేపట్టాలని నిర్ణయించారు. బుధవారం నగరంలోని బీసీ కమిషన్ ఆఫీస్ లో కమిషన్ చైర్మన్ నిరంజన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 28 నుంచి ఈనెల రెండో తేదీ వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ విచారణలో కమిషన్ దృష్టికి వచ్చిన వివిధ అంశాలపై సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు బీసీ కులాల వారిని సామాజిక బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆ కమిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాయనున్నారు. బహిరంగ విచారణలో కమిషన్ దృష్టికి వచ్చిన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల్లో బీసీల స్థితి గతులపై 18వ తేదీ నుంచి 26 వరకు బహిరంగ విచారణ జరపనున్నారు. సమావేశంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.