బరిలో ఎవరు ఉన్నా.. మునుగోడులో గెలుపును నిర్ణయించేది వీళ్లే
మునుగోడులో ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా గౌడ్, ముదిరాజ్‌ల ఓటర్లను తమ వైపు తిప్పుకుంటే చాలని చరిత్ర చెబుతోంది. మొదటి నుంచి వీళ్లు కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు.
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా, టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కాగా, మునుగోడు నియోజకవర్గ చరిత్ర చూస్తే.. 1967 నుంచి ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. ఏ పార్టీ తరపున పోటీ చేసినా.. ఎక్కువ సార్లు రెడ్లే తమ ఆధిక్యతను ప్రదర్శించారు. 1967 నుంచి 1985 వరకు, 1999 నుంచి 2004 వరకు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఇక 2004 నుంచి 2009 వరకు పల్లా వెంకటరెడ్డి సీపీఐ తరపున, 2014 నుంచి 2018 వరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ తరపున, 2018లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరపున గెలుస్తూ వస్తున్నారు. మధ్యలో 1985 నుంచి 1999 వరకు ఉజ్జిని నారాయణరావు, 2009 నుంచి 2014 వరకు ఆయన కుమారుడు ఉజ్జిని యాదగిరి రావు గెలిచారు. ఈ కుటుంబం తప్ప అందరూ రెడ్లే కావడం గమనార్హం.
ఈ నియోజకవర్గంలో రెడ్లు అత్యధిక సార్లు గెలిచారంటే.. ఇక్కడ వాళ్లు ఓట్లు భారీగా ఉన్నాయేమో అనుకుంటాము. కానీ, ఇక్కడ రెడ్ల ఓట్లు కనీసం గెలుపు మీద ప్రభావం చూపించేంతగా కూడా ఉండవు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీల ఓట్లే ఉంటాయి. కేవలం గౌడ్, ముదిరాజ్‌ల ఓట్లు కలిపితేనే 31 శాతం ఉన్నాయి. కానీ రెడ్ల ఓట్లు కేవలం 3.49 శాతం మాత్రమే. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా గౌడ్, ముదిరాజ్‌ల ఓటర్లను తమ వైపు తిప్పుకుంటే చాలని చరిత్ర చెబుతోంది. మొదటి నుంచి వీళ్లు కాంగ్రెస్ పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఇక కమ్యూనిస్టు పార్టీకి ఓట్లు వేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు పలికినా.. ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇక్కడ ఏ సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయో ఒక సారి పరిశీలిద్దాం.
మునుగోడులో మొత్తం ఓటర్ల సంఖ్య - 2,20,520
1. గౌడ్ - 35,150 (15.94%)
2. ముదిరాజ్ - 33,900 (15.37%)
3. యాదవులు - 21,360 (9.69%)
4. పద్మశాలి - 11,680 (5.30%)
5. కుమ్మరి - 7,850 (3.56%)
6. విశ్వ బ్రాహ్మణ - 7,820 (3.55%)
7. మున్నూరు కాపు - 2,350 (1.07%)
8. మాదిగ - 25,650 (11.63%)
9. మాల - 10,350 (4.69%)
10. లంబాడి, ఎరుకల - 10,520 (4.77%)
11. వడ్డెర - 8,350 (3.79%)
12. రెడ్డి - 7,690 (3.47%)
13. కమ్మ - 5,680 (2.58%)
14. వెలమ - 2,360 (1.07%)
15. ఆర్యవైశ్య - 3,760 (1.71%)
16. ముస్లింలు - 7,650 (3.47%)
19. ఇతరులు - 18,400 (8.34%)
పై పట్టిక పరిశీలిస్తే బీసీ, ఎస్సీ ఓటర్లే ఇక్కడ గెలుపును నిర్ణయిస్తారని తెలిసిపోతోంది. గత కొన్నేళ్లుగా పార్టీలకు అతీతంగా రెడ్డి అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. కాగా, ఈ సారి ముగ్గురు కూడా రెడ్డి అభ్యర్థులే ఉండబోతున్నారు. దీంతో కులాలవారీగా ఎవరికి ఎంత మేర ఓట్లు లభిస్తాయనేది అంచనాకు రాలేకపోతున్నారు. కాగా, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటింగ్ కనుక పూర్తి స్థాయిలో పడితే ఆ అభ్యర్థే గెలిచే అవకాశం ఉంటుంది. ఇక అధికార టీఆర్ఎస్ కూడా అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి అన్ని పార్టీలు పక్కాగా లెక్కలు వేసుకొని ముందుకు వెళ్తున్నాయి.