Telugu Global
Telangana

240 వెరైటీల్లో ఈ ఏడాది బతుకమ్మ చీరలు

సిరిసిల్లలో చీరల వస్త్రాన్ని తయారు చేసి, దాన్ని ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తారు. సిరిసిల్లలో 2, హైదరాబాద్ లో 9 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఆ చీరలను ప్యాకింగ్ చేసి జిల్లాలకు తరలిస్తున్నారు.

240 వెరైటీల్లో ఈ ఏడాది బతుకమ్మ చీరలు
X

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం తరపున ఉచితంగా చేపట్టే చీరల పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతుంది. వచ్చే నెలనుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే చీరల తయారీ ఊపందుకుంది. ఈ ఏడాది బతుకమ్మ చీరలకోసం మొత్తం 350 కోట్ల రూపాయలు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఆర్డర్ ను సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చారు. బతుకమ్మ పండగకోసం కోటి చీరలు ఇక్కడ తయారవుతున్నాయి.

10 రంగులు, 25 డిజైన్లు..

ఈ ఏడాది మొత్తం 10 రంగుల్లో 25 డిజైన్లతో బతుకమ్మ చీరలు సిద్ధం చేస్తున్నారు. 240 వెరైటీల్లో ఈ చీరలు ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. జరీ అంచుతో ఈ చీరలు సిరిసిల్ల నేతన్నల చేతిలో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 30 లక్షలకు పైగా చీరల ఉత్పత్తి పూర్తయినట్టు తెలుస్తోంది. వాటి ప్రాసెసింగ్ కూడా పూర్తి కాగా.. చేనేత జౌళి శాఖ యంత్రాంగం చీరలను జిల్లా కేంద్రాలకు తరలిస్తోంది. బతుకమ్మ వేడుకలు మొదలయ్యే లోపే చీరల పంపిణీ పూర్తి చేసేందుకు జౌళిశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

సిరిసిల్లలో చీరల వస్త్రాన్ని తయారు చేసి, దాన్ని ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తారు. సిరిసిల్లలో 2, హైదరాబాద్ లో 9 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఆ చీరలను ప్యాకింగ్ చేసి జిల్లాలకు తరలిస్తున్నారు. అక్టోబర్ నాటికి ఈ మొత్తం ప్రక్రియను పూర్తవుతుందని అంచనా.

అందరికీ పండగే..

బతుకమ్మ పండగ సందర్భంగా ప్రభుత్వం నుంచి చీరలను సారెగా అందుకుంటున్న ఆడపడుచులు ఆనందంతో ఉంటారు. అదే సమయంలో చేనేత కార్మికులకు ఈ చీరల కారణంగా చేతినిండా పని దొరుకుతోంది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపుగా 15000 మంది ఉపాధి లభిస్తుంది. బతుకమ్మ చీరల తయారీ సందర్భంలో నెలకు తమకు 20వేల వరకు కూలీ గిట్టుబాటు అవుతోందని సంతోషంగా చెబుతున్నారు నేత కార్మికులు.

First Published:  2 Sept 2023 10:04 AM IST
Next Story