మూడేళ్ల విరామం తర్వాత చేపమందు పంపిణీ..
కోర్టు అనుమతితో పేరు మార్చి చేప ప్రసాదంగా దీన్ని పంపిణీ చేస్తున్నారు. కరోనా వల్ల మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని తిరిగి పంపిణీ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

మూడేళ్ల విరామం తర్వాత చేపమందు పంపిణీ..
ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు చేపమందు పంపిణీ కరోనా కారణంగా మూడేళ్లుగా ఆగిపోయింది. ఈ ఏడాది చేపమందు పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పంపిణీ చేయడానికి బత్తిని సోదరులకు అనుమతి లభించింది. దీంతో చేపమందు పంపిణీపై బత్తిని సోదరులు ఓ ప్రకటన విడుదల చేశారు.
పంపిణీ ఎప్పుడు..?
జూన్ 10 తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్ 11 వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల సేపు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబం ప్రకటించింది. ప్రతి ఏడాదీ ఉచితంగా బత్తిని సోదరులు చేపమందు పంపిణీ చేస్తుంటారు. శాస్త్రీయ ఆధారాలు ఎలా ఉన్నా.. చేపమందుకోసం ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు హైదరాబాద్ కి వస్తుంటారు. కరోనా వల్ల మూడేళ్లుగా పంపిణీ వాయిదా పడింది. ఈఏడాది ఎట్టకేలకు అనుమతి లభించింది.
ప్రతి ఏడాదీ మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ చేస్తారు. ఆయుర్వేద మందుతోపాటు పాలపిండి, ఇంగువ, బెల్లం, పసుపు వంటి సహజ పదార్ధాలను దీని తయారీలో వాడతారు. ఈ మందుని కొరమీను చేపనోటిలో ఉంచి రోగులతో మింగిస్తారు. ఆ సమయంలో చేపపిల్ల బతికి ఉంటే మందు బాగా పనిచేస్తుందని నమ్మకం. బతికి ఉన్న చేప పిల్లను మింగడం వల్ల ఇతర సమస్యలు వస్తాయని జనవిజ్ఞానవేదిక నాయకులు దీనిపై కోర్టుకెక్కిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత కోర్టు అనుమతితో పేరు మార్చి చేప ప్రసాదంగా దీన్ని పంపిణీ చేస్తున్నారు. కరోనా వల్ల మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని తిరిగి పంపిణీ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.