Telugu Global
Telangana

కేటీఆర్ స్ఫూర్తి.. ఎన్నారై దంపతుల విరాళం రూ.కోటి

కేటీఆర్‌ని చూసి ఇన్స్ పైర్ అయ్యామని, తమ ఊరి కోసం ఏదైనా చేయాలనుకున్నామని, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డితో మాట్లాడి స్కూల్ అభివృద్ధి కోసం కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యామని అంటున్నారు బత్తిని దంపతులు.

కేటీఆర్ స్ఫూర్తి.. ఎన్నారై దంపతుల విరాళం రూ.కోటి
X

పల్లెటూళ్లలో సర్కారు బడికి వెళ్లి చదువుకున్నవాళ్లు చాలామంది ప్రస్తుతం గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, వేలాది మందికి ఉపాధి కల్పించే కంపెనీలు స్థాపించారు. మరి సొంత ఊరిలో కూడా వారి పేరు చిరకాలం గొప్పగా చెప్పుకోవాలంటే, ఊరికి ఎంతో కొంత తిరిగిస్తే చాలు. అయితే ఆ సాయం మరింత మందిని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే మాత్రం దాన్ని విద్యావ్యవస్థలోనే ఉపయోగించాలి. అలాంటి మంచి పని కోసం బత్తిని కుటుంబం ముందుకొచ్చింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో నివాసం ఉంటున్న బత్తిని రమేష్, బత్తిని మాధవి దంపతులు తమ సొంత ఊరు పొనుగోడులో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

కేటీఆర్ మా స్ఫూర్తి..

మంత్రి కేటీఆర్ ఆమధ్య అమెరికా పర్యటనలో ఎన్నారైలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన ప్రసంగంతో స్ఫూర్తి పొందిన బత్తిని రమేష్, తాను కూడా ఊరికి ఏదైనా చేయాలని సంకల్పించారు. స్వయానా మంత్రి కేటీఆర్ కూడా సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తిగా మారాయి. కేటీఆర్‌ని చూసి ఇన్స్ పైర్ అయ్యామని, తమ ఊరి కోసం ఏదైనా చేయాలనుకున్నామని, స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డితో మాట్లాడి స్కూల్ అభివృద్ధి కోసం కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యామని అంటున్నారు బత్తిని దంపతులు.


జిల్లా కలెక్టర్ కు లేఖ..

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం పొనుగోడులో ఉన్న జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి కోటి రూపాయలు విరాళంగా అందిస్తామంటూ బత్తిని రమేష్.. జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. పాఠశాలలో నూతన భవనాల కోసం కానీ, కొత్త పరికరాల కొనుగోలుకు కానీ, స్టాఫ్ కోసం కానీ.. ఆ నగదుని ఉపయోగించుకోవాలని బత్తిని రమేష్ తన లేఖలో కోరారు. తమ తల్లిదండ్రులు బత్తిని వీరమ్మ, బత్తిని సత్యం పేరు మీద స్కూల్ ని దత్తత తీసుకునే అవకాశం తమకు కల్పించాలని కోరారు. ఆ లేఖను ఎమ్మెల్యే సైదిరెడ్డి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్నారై దంపతుల సేవా నిరతిని కొనియాడారు. వారిలో స్ఫూర్తి రగిల్చిన మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యే సైదిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  24 April 2023 11:40 AM IST
Next Story