Telugu Global
Telangana

గుడ్లు, మాంసం.. తెలంగాణలో అత్యధిక వినియోగం

దేశంలో తలసరి ఒక్కో వ్యక్తికి ప్రతి ఏడాదీ 101 కోడిగుడ్లు లభ్యమవుతుండగా.. తెలంగాణలో ఆ సంఖ్య 466. కోడిగుడ్ల తలసరి లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలిచింది.

గుడ్లు, మాంసం.. తెలంగాణలో అత్యధిక వినియోగం
X

తెలంగాణలో గత నాలుగేళ్లుగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కారణంగా మాంసం ఉత్పత్తి, లభ్యత భారీగా పెరిగాయి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1.28 కోట్ల గొర్రెల పంపిణీ పూర్తికాగా, పౌల్ట్రీ రంగం కూడా కొత్తగా 1500 కోళ్లఫారాలు వచ్చాయి. వీటి ద్వారా గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మాంసం వినియోగంలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

ప్రాథమిక పశుపోషణ గణాంకాల వార్షిక నివేదిక-2023 ఆధారంగా తెలంగాణ మాంసం వినియోగంలో అగ్రస్థానంలో నిలిచినట్టు వెల్లడయింది. కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటస్టిక్స్(BAHS) జాతీయ స్థాయిలో ఏటా గణాంకాలతో సహా వార్షిక నివేదికలు రూపొందిస్తోంది. 2023కు సంబంధించి తాజాగా వార్షిక నివేదిక విడుదల చేసింది. మాంస ఉత్పత్తిలో తెలంగాణ దేశవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉన్నా.. వినియోగంలో మాత్రం టాప్ లో ఉంది. దేశంలో ప్రతి వ్యక్తికి సరాసరి సంవత్సరానికి 7.10 కిలోల మాంసం లభ్యమవుతోంది. తెలంగాణలో మాత్రం అత్యధికంగా 28.51 కిలోలు లభిస్తోంది. దేశంలో ప్రతి ఏటా 9.77 మిలియన్‌ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. అందులో తెలంగాణ వాటా 11.06 శాతం కావడం విశేషం. తెలంగాణలో ప్రతి ఏటా 1.08 మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది.

దేశంలో తలసరి ఒక్కో వ్యక్తికి ప్రతి ఏడాదీ 101 కోడిగుడ్లు లభ్యమవుతుండగా.. తెలంగాణలో ఆ సంఖ్య 466. కోడిగుడ్ల తలసరి లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, ఉత్పత్తిలో 3వ స్థానంలో నిలిచింది. కోడిగుడ్ల ఉత్పత్తి దేశంలో 138.38 బిలియన్లు కాగా, తెలంగాణలో 17.67 బిలియన్లు. పాల లభ్యతలో కూడా దేశ సగటుని తెలంగాణ దగ్గర్లో ఉంది.

First Published:  1 Dec 2023 10:44 AM IST
Next Story