రాజ్ భవన్ లో ట్రిపుల్ ఐటీ పంచాయితీ.. టీఆర్ఎస్ రియాక్షన్ ఏంటంటే..?
సడన్ గా ఫుడ్ పాయిజన్ వ్యవహారంతో ప్రభుత్వం మరింత ఇరుకున పడింది. ఆ తర్వాత విద్యార్థులు నేరుగా రాజ్ భవన్ కి వచ్చారు. అయితే రాజ్ భవన్ నుంచి ఆహ్వానం వెళ్లిందా, బీజేపీ నేతల ప్రోద్బలంతోనే ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రాజ్ భవన్ కి వచ్చారా అనేది తేలాల్సి ఉంది.
ఆ మధ్య మహిళా దర్బార్ అంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై మొదలు పెట్టిన కార్యక్రమంపై రాజకీయ విమర్శలు చెలరేగాయి. అప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య ఉన్న గ్యాప్ ఆ కార్యక్రమంతో మరింత పెరిగింది. ఇటీవల వరద రాజకీయాలతో మరింత పెద్దదైంది. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పంచాయితీ రాజ్ భవన్ కి చేరడంతో ఈ గ్యాప్ కవర్ అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. సహజంగా ఏ రాష్ట్రంలో అయినా సమస్యలొస్తే ప్రభుత్వం పరిష్కరిస్తుంది, నేరుగా ఆ సమస్యలు గవర్నర్ ఆఫీస్ కి వస్తే, ప్రభుత్వానికి రెఫర్ చేయడం కానీ, సూచనలివ్వడం కానీ చేస్తుంటారు గవర్నర్లు. కానీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. గవర్నర్లు తమ సొంత నిర్ణయాలతో ముఖ్యమంత్రుల్ని ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణలో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారుతోంది.
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను గవర్నర్ తమిళిసై దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. ఇటీవల వర్సిటీ సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళన బాటపట్టారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేెకపోవడం, సిబ్బంది కొరతపై వారు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. వర్షాల్లో కూడా నిరసనలు తెలపడంతో ఆ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో విద్యార్థులు శాంతించారు. ఆ తర్వాత సిబ్బందిని మార్చడం, శాశ్వత పరిష్కార మార్గాలను చూపడంతో అంతా బాగుందనే అనుకున్నారు. కానీ సడన్ గా ఫుడ్ పాయిజన్ వ్యవహారంతో ప్రభుత్వం మరింత ఇరుకున పడింది. ఆ తర్వాత విద్యార్థులు నేరుగా రాజ్ భవన్ కి వచ్చారు. అయితే రాజ్ భవన్ నుంచి ఆహ్వానం వెళ్లిందా, బీజేపీ నేతల ప్రోద్బలంతోనే ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రాజ్ భవన్ కి వచ్చారా అనేది తేలాల్సి ఉంది.
మొత్తానికి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రాజ్ భవన్ కు రావడం, సమస్యలను చెప్పడం, దానికి గవర్నర్ తమిళి సై సానుకూలంగా స్పందించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ ఎపిసోడ్ లో సమస్యల పరిష్కారం కంటే ఎక్కువగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నేరుగా గవర్నర్ ని కలసి ఫిర్యాదు చేయడంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. టీఆర్ఎస్ నాయకులు మాత్రం గవర్నర్ తీరును తప్పుబడుతున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. కావాలనే విద్యార్థులను రాజ్ భవన్ కు పిలిపించారని, వారిని రెచ్చగొడుతున్నారని అంటున్నారు. అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఈ వ్యవహారంపై ఎలాంటి స్పందన రాలేదు.