Telugu Global
Telangana

బాసర ట్రిబుల్‌ ఐటీ కేరాఫ్‌ సూసైడ్స్‌

అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాలికల వసతి గృహం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథ‌మ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

బాసర ట్రిబుల్‌ ఐటీ కేరాఫ్‌ సూసైడ్స్‌
X

బాసర ట్రిపుల్‌ ఐటీ వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పీయూసీ విద్యార్థిని దీపిక ఆత్మహత్యను మర్చిపోకముందే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత ఆత్మహత్యకు పాల్పడింది.

అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాలికల వసతి గృహం 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథ‌మ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యుల పరీక్ష అనంతరం, మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే లిఖిత మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక రెండు రోజుల క్రితం బాత్‌రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గోరేకల్‌కు చెందిన దీపిక మృతితో విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. దీపిక మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు చనిపోతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. వర్సిటీలో రెండు రోజుల క్రితం జరిగిన పరీక్షలో ముగ్గురు విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. వారిలో దీపిక కూడా ఉంది. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినందుకు డీబార్‌ చేస్తారనే భయంతోనే దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

దీపిక వ్యవహారం మర్చిపోకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందడం బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత పీయూసీ ఫస్ట్‌ ఇయర్ చదువుతోంది. లిఖిత గర్ల్స్ క్యాంపస్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయిందని వర్సిటీ సిబ్బంది చెబుతున్నారు. కానీ, తోటి విద్యార్థులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. లిఖిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వరుస ఆత్మహత్యలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

First Published:  15 Jun 2023 10:33 AM IST
Next Story