Telugu Global
Telangana

గన్ మెన్లను ఇవ్వండి.. బర్రెలక్క పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

తాను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు తనపై దాడులకు ప్రయత్నిస్తున్నారని, తన తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తనకు తెలుసని అంటున్నారు శిరీష అలియాస్ బర్రెలక్క. కానీ వారి పార్టీ పేరు తాను వెల్లడించబోనని స్పష్టం చేశారు.

గన్ మెన్లను ఇవ్వండి.. బర్రెలక్క పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
X

తనకు ప్రాణహాని ఉందని 2ప్లస్‌2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష(బర్రెలక్క) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తనకు సెక్యూరిటీ ఇచ్చే విషయంలో హోంశాఖ ప్రధాన కార్యదర్శి, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కు ఆదేశాలు జారీ చేయాలని ఆమె హైకోర్టుని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది.

ఎన్నికల వేళ బర్రెలక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో ఆమె ప్రభావం పెద్దగా ఉండదని అంటున్నారు ప్రధాన పార్టీల నాయకులు. గతంలో కూడా ఇలా సోషల్ మీడియాలో హడావిడి చేసిన చాలామంది అభ్యర్థులు ఓట్ల దగ్గర చతికిలబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బర్రెలక్క తమ్ముడిపై జరిగిన దాడి చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం కొల్లాపూర్‌ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఆమె తమ్ముడు ఈ దాడిలో గాయపడ్డాడు. దాడి అనంతరం తనకు ప్రాణ హాని ఉందని, సెక్యూరిటీ కావాలని బర్రెలక్క కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తాను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు తనపై దాడులకు ప్రయత్నిస్తున్నారని, తన తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తనకు తెలుసని అంటున్నారు శిరీష అలియాస్ బర్రెలక్క. కానీ వారి పార్టీ పేరు తాను వెల్లడించబోనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తనకు విజయావకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశారు.


First Published:  24 Nov 2023 3:48 AM GMT
Next Story