Telugu Global
Telangana

ప్రసవాల్లో బాన్సువాడ ఆస్పత్రి రికార్డ్

గతంలో జనగామ జిల్లాలో ఒకేరోజు 35 ప్రసవాలు జరగడం అరుదైన రికార్డ్ గా ఉంది. వనపర్తి మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఒకేరోజు 32 ప్రసవాలు జరిగాయి. మెదక్ జిల్లా ఆస్పత్రిలో ఒకేరోజు 25మందికి పురుడుపోశారు వైద్యులు ఇవన్నీ సింగిల్ డే రికార్డ్ లు. ఇప్పుడు బాన్సువాడ వైద్యశాల నెలరోజుల సగటులో రికార్డు సృష్టించడం విశేషం.

ప్రసవాల్లో బాన్సువాడ ఆస్పత్రి రికార్డ్
X

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు ప్రసవాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతాశిశు వైద్యశాల ప్రసవాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఒక నెలలో అత్యధికంగా 504 ప్రసవాలు ఈ ఆస్పత్రిలో జరిగాయి. నెలరోజుల్లో అత్యథిక కాన్పులు జరిగిన ఆస్పత్రిగా ఇప్పుడు బాన్సువాడ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

గర్భిణిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తున్నా కూడా డెలివరీ సమయంలో సహజంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. కానీ తెలంగాణలో పేద, మధ్యతరగతి వర్గాల నమ్మకాన్ని చూరగొన్నాయి ప్రభుత్వ ఆస్పత్రులు. నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి. జిల్లాలో మెడికల్ కాలేజీతో వైద్య విద్యా వ్యవస్థ కూడా సమూలంగా మారింది. ఇక మాతా శిశు ఆస్పత్రులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. జిల్లాల్లో ప్రత్యేకంగా మాతా శిశు వైద్యశాలలు ఏర్పాటు చేసి అధునాతన పరికరాలు అందుబాటులో ఉంచింది. నియామకాలు కూడా పెంచడంతో నిత్యం వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటున్నారు. గతంలో జనగామ జిల్లాలో ఒకేరోజు 35 ప్రసవాలు జరగడం అరుదైన రికార్డ్ గా ఉంది. వనపర్తి జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఒకేరోజు 32 ప్రసవాలు జరిగాయి. మెదక్ జిల్లా ఆస్పత్రిలో ఒకేరోజు 25మందికి పురుడుపోశారు వైద్యులు ఇవన్నీ సింగిల్ డే రికార్డ్ లు. ఇప్పుడు బాన్సువాడ వైద్యశాల నెలరోజుల సగటులో రికార్డు సృష్టించడం విశేషం. ఆగస్ట్ నెలలో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.

ఆగస్ట్ నెలలో బాన్సువాడ ఆస్పత్రిలో మొత్తం 504మందికి ప్రసవాలు జరిగాయి. ఇందులో 64 శాతం సాధారణ ప్రసవాలు కావడం మరో విశేషం. మూడు నెలలుగా రాష్ట్రంలోనే అత్యథిక ప్రసవాల్లో బాన్సువాడ మొదటి స్థానంలో ఉందని, ఆగస్ట్ తో రికార్డ్ ఫీట్ సాధించామని అంటున్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శ్రీనివాస్‌ ప్రసాద్‌. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది సంబరాలు నిర్వహించారు. ఈ రికార్డ్ ఫీట్ పై స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిబ్బందిని అభినందించారు.

First Published:  3 Sept 2023 7:31 AM IST
Next Story