ఇక డైరెక్ట్ ఫైట్.. బండి వ్యతిరేక వర్గంతో ఈటల భేటీ
బీజేపీలో బీసీ బాస్ ఎవరో తేల్చుకోడానికి రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ మధ్య ఆసక్తిర పోరు సాగుతోంది.
తెలంగాణలో అధికారం కావాలనుకుంటున్న బీజేపీ ఎన్నికలకు ముందే కుప్పకూలేలా ఉంది. ఇప్పటికే అక్కడ ఆధిపత్య పోరు నడుస్తోంది. బీసీలకే అధికారం అంటూ హడావిడి జరుగుతున్నవేళ, బీజేపీలో ఆ బీసీ బాస్ ఎవరో తేల్చుకోడానికి రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ మధ్య ఆసక్తిర పోరు సాగుతోంది. నిన్న మొన్నటి వరకూ ఇది ముసుగులో గుద్దులాటగా ఉండేది, ఇప్పుడిప్పుడే ఈ పోరు రోడ్డునపడుతోంది. తాజాగా కరీంనగర్ లో బండి సంజయ్ వ్యతిరేక వర్గాన్ని ఈటల రాజేందర్ కలిశారు. దీంతో బండి వర్గం రగిలిపోతోంది. బహిరంగంగానే ఈటలపై విమర్శలు ఎక్కుపెట్టింది.
ఈటల రాజేందర్ సీనియర్ నేత, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ తర్వాత చెప్పుకోదగ్గ స్థానం ఆయనకు ఉంది. ఇప్పుడు బీజేపీలో పరిస్థితి తలకిందులైంది. కొత్తగా పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయించాలంటే కుదరదంటోంది బండి సంజయ్ వర్గం. దీనికితోడు చేరికల కమిటీ చైర్మన్ గా ఆయన బండిని లెక్కచేయకుండా ఒంటరిగా వ్యవహారాలు చక్కబెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ బీజేపీలో పట్టు సాధించాలనుకుంటున్నారు. అందుకే మెల్ల మెల్లగా బండి వ్యతిరేక వర్గానికి నాయకుడిగా మారేందుకు పావులు కదుపుతున్నారు ఈటల. కరీంనగర్ బీజేపీ సీనియర్ నాయకులు పొలసాని సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణా రెడ్డిని కలిశారు ఈటల. గుజ్జుల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఈ ఫొటోలు, వార్త బయటకు రాగానే బండి వర్గం రుసరుసలాడుతోంది.
బీజేపీలో బండి వ్యతిరేక వర్గం ఉంది కానీ, దానికి సరైన నాయకుడు లేరు. కిషన్ రెడ్డి కేంద్ర రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, బండిని తనకి పోటీదారుగా ఆయన భావించట్లేదు. అందులోనూ బండికి బీసీ కార్డ్ ఉంది, అదే సామాజిక వర్గం నుంచి ఇప్పుడు ఈటల పోటీకి వస్తున్నారు. దీంతో సహజంగానే వారిద్దరి మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. బండి వ్యతిరేక వర్గాన్ని ఒకేచోటకు చేర్చే ప్రయత్నం చేస్తున్న ఈటల పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.