Telugu Global
Telangana

బండి సంజయ్ కొత్త సచివాలయానికి వెళ్ళరట !

''నూతన సచివాలయ నిర్మాణం తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా ఉంది. మేము అధికారంలోకి రాగానే ఆ నిర్మాణంలో మార్పులు చేస్తాం.సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలే. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన కొత్త సచివాలయంలోకి మేము అడుగుపెట్టము.'' అని బండి అన్నారు.

బండి సంజయ్ కొత్త సచివాలయానికి వెళ్ళరట !
X

తెల‍ంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చాలా రోజులుగా మతపరమైన దాడి చేస్తోంది. సచివాలయంపైన ఉన్న డూం లు ముస్లిం సాంప్రదాయమని, వాటిని కూల్చి వేస్తామని గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మరో వైపు సోషల్ మీడియాలో కూడా మతపరమైన వ్యాఖ్యానాలతో నూతన సచివాలయం నిర్మాణం పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

సచివాలయ నిర్మాణంలో ముస్లిం మత గుర్తులున్నాయన్న ఆరోపణలతో హిందువులను రెచ్చగొట్టేందుకు బండి సంజయ్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని, ఈ సంవత్సరంలోనే అసెంబ్లీ ఎన్నికలుండటంతో దాన్ని ఎన్నికల అంశంగా చేసి హిందూ ఓట్లు కొల్లగొట్టాలన్న ప్రణాళికలో భాగంగానే బండి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజనులు ఫైర్ అవుతున్నారు.

దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ భవనాలు ఇదే పద్దతిలో నిర్మించినట్టు నెటిజనులు రుజువులతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయినప్పటికీ బండి సంజయ తన దాడిని ఆపడం లేదు. ఈ అంశంపై ఈ రోజు మళ్ళీ దాడి చేశారు సంజయ్.

''నూతన సచివాలయ నిర్మాణం తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా ఉంది. మేము అధికారంలోకి రాగానే ఆ నిర్మాణంలో మార్పులు చేస్తాం.సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలే. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన కొత్త సచివాలయంలోకి మేము అడుగుపెట్టము.'' అని బండి అన్నారు.

కాగా, బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షాలు సచివాలయం వెళ్ళి మంత్రులను కలవకుండా సమస్యలను ఎలా పరిష్కరిస్తారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ''చెరువు మీద అలిగితే...'' ఎవరికి నష్టమని ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రజలకున్న అసలు సమస్యలను వదిలేసి మతము, కులము అంటూ ప్రజలను విభజించవద్దని బండి సంజయ్ ని పలువురు నెటిజనులు కోరుతున్నారు.

First Published:  29 April 2023 11:03 PM IST
Next Story