సంజయ్ వర్సెస్ ఈటల.. ఆ 3 సీట్లపై పేచీ.!
బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, వేములవాడ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు బీజేపీ.
బీజేపీ మూడు విడతల్లో 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 31 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, హుస్నాబాద్‌తో పాటు సంగారెడ్డి టికెట్ల విషయంలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్‌గా పరిస్థితి మారిందని సమాచారం.
బండి సంజయ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుస్నాబాద్, వేములవాడ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు బీజేపీ. వేములవాడ టికెట్ కోసం మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన తుల ఉమా పోటీ పడుతున్నారు. వికాస్ రావుకే టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ పట్టుబడుతుండగా.. తుల ఉమాకు అవకాశం ఇవ్వాలని ఈటల డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ సీటు పెండింగ్‌లోనే ఉండిపోయింది.
ఇక హుస్నాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తికి టికెట్ దక్కేలా బండి ప్రయత్నాలు చేస్తుండగా.. జన్నపురెడ్డి సురేందర్‌కు టికెట్ వచ్చేలా ఈటల ఎత్తులు వేస్తున్నారు. ఇక సంగారెడ్డి టికెట్ రాజేశ్వర్ దేశ్‌పాండేకు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. పులిమామిడి రాజుకు సంగారెడ్డి టికెట్ ఇవ్వాలని ఈటల రాజేందర్ పట్టుడుతున్నారని సమాచారం. దీంతో ఈ మూడు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక నారాయణ్ ఖేడ్‌లో తన అనుచరుడు సంగప్పకు టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు బండి సంజయ్.