మహిళా కమిషన్ ముందుకు బండి.. విచారణ ఎప్పుడంటే..?
ఈనెల 18న మహిళా కమిషన్ విచారణ సందర్భంగా అయినా బండి తన తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరతారేమో చూడాలి.
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బండిని ఈనెల 15న విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది. అయితే పార్లమెంట్ సమావేశాలున్నాయని, తాను విచారణకు రాలేనని బదులిచ్చారాయన. ఈనెల 18న విచారణకు వస్తానని తెలియజేశారు. దీనిపై మహిళా కమిషన్ స్పందించింది.
ఈనెల 18 బండి సంజయ్ విచారణకు రావాలన కోరింది మహిళా కమిషన్. ఆయన అభ్యర్థన మేరకు తెలంగాణ మహిళా కమిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు స్వయంగా బండి సంజయ్ విచారణకు హాజరుకావాలని సూచించింది మహిళా కమిషన్.
ఇంటా బయటా నిరసనలు..
బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించి నిరసనలు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా బండికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనంతో బండిపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. అటు బీజేపీనుంచి కూడా కొంతమంది నేతలు బండి వ్యాఖ్యలను ఖండించారు. బండి కామెంట్ల నేపథ్యంలో బీజేపీలో రెండు వర్గాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈనెల 18న మహిళా కమిషన్ విచారణ సందర్భంగా అయినా బండి తన తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరతారేమో చూడాలి.