ఏపీకి బండి సంజయ్.. ఈ నెల 21న కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించిన తర్వాత ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. కొత్త పదవి చేపట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఇక ఏపీలో తొలి సారి పర్యటించనున్నారు.
ఏపీ బీజేపీలో ఉత్సాహం నింపేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నది. కొన్నాళ్ల పాటు ఏపీ బీజేపీకి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సేవలు వాడుకోవాలని నిర్ణయించింది. ఇందుకు బండి సంజయ్ కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 21న జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతి రానున్నట్లు తెలుస్తున్నది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికల జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియపై బండి సంజయ్ సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించిన తర్వాత ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టింది. కొత్త పదవి చేపట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఇక ఏపీలో తొలి సారి పర్యటించనున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, గోవా, ఒడిషా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను పరిశీలించే బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఏపీకి ఆయన వస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు బండి సంజయ్‌ను ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా కూడా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ కో-ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సునీల్ దేవ్‌ధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారు. ఇంక ఇంచార్జిగా ఉన్న మురళీధరన్ 2018 నుంచి ఏపీ వ్యవహారాలు చూస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఆయన ఇంచార్జిగా ఉన్నా.. గత మూడు నెలలుగా మాత్రం ఏపీ వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా ఇద్దరు ఇంచార్జీలు లేక ఏపీ బీజేపీ డీలా పడిపోయింది.
ఈ క్రమంలో ఏపీ బీజేపీ ఇంచార్జిగా బండి సంజయ్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీలో దూకుడు పెంచినట్లుగానే.. ఏపీలో కూడా బండి సంజయ్ బీజేపీలో ఉత్సాహం నింపుతారని అధిష్టానం అంచనా వేస్తోంది. అయితే, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం.. వర్గాల మధ్య ఉద్రిక్తలకు ఆజ్యం పోసేలా మాట్లాడటం బండి సంజయ్‌కు అలవాటు. ఇప్పుడు ఇదే పంథాలో ఏపీలో కూడా వ్యవహరిస్తే.. ఇప్పటికే అక్కడ రాజకీయ పార్టీల మధ్య ఉన్న కుల రాజకీయాలకు.. మత రాజకీయాలు కూడా తోడవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాగా, బండి సంజయ్‌ను ప్రస్తుతానికి ఓటర్ల జాబితా పరిశీలన అంశానికే పరిమితం చేస్తారని.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఆయనకు మరో బాధ్యత అప్పగించే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది.