షర్మిల ఆఫర్ తిరస్కరించిన బండి.. ఫోన్లో ఏం చెప్పారంటే..?
షర్మిల తనకు ఫోన్ చేసి మాట్లాడిన సంగతి వాస్తవమేనని అన్నారు బండి సంజయ్. ఆమెకు అన్యాయం జరిగినప్పుడు ఖండించానని, భవిష్యత్తులో ఎవరికి అన్యాయం జరిగినా తాము పోరాడతామని అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవ్వాలి, కలసి పోరాటం చేద్దాం రండి అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్ ను తాను తిరస్కరించానని చెప్పారు బండి సంజయ్. కాంగ్రెస్ తో కలసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారట. షర్మిల తనకు ఫోన్ చేసి మాట్లాడిన సంగతి వాస్తవమేనని అన్నారు బండి సంజయ్. ఆమెకు అన్యాయం జరిగినప్పుడు ఖండించానని, భవిష్యత్తులో ఎవరికి అన్యాయం జరిగినా తాము పోరాడతామని అన్నారు. అయితే కాంగ్రెస్ తో కలిసి పనిచేయబోమని షర్మిలకు స్పష్టం చేశానంటున్నారు బండి సంజయ్.
ఒకటేనని తేలిపోయిందా..?
తెలంగాణలో షర్మిల ఎవరు వదిలిన బాణమో ఈపాటికే అందరికీ అర్థమైంది. అయితే అప్పుడప్పుడు బీజేపీపై కూడా అలా మాట తూలుతూ తాను న్యూట్రల్ అని కవర్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారామె. ఇప్పుడు షర్మిలతో బీజేపీ కలసి పనిచేస్తే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న లాలూచీ బయటపడిపోతుందేమోనని బండి వెనక్కి తగ్గినట్టున్నారు. షర్మిల అడగటం, బండి నో చెప్పడం.. ఇదంతా పొలిటికల్ గేమ్ ప్లాన్ లో భాగమేనంటున్నారు నెటిజన్లు.
షర్మిలకు అవసరం..
వైఎస్సార్టీపీ పేరుతో పాదయాత్ర చేస్తున్నా షర్మిలకు తెలంగాణలో వస్తున్న ప్రజాదరణ అంతంతమాత్రం. ఆమె భాష, ఆధారాలు లేని తీవ్ర మైన ఆరోపణలను తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడంలేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో లేని వ్యక్తులు తెలంగాణ ఏర్పాయిన తర్వాత రాజకీయాల పేరుతో పదవులకోసం రోడ్డెక్కి పాదయాత్ర చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మేంత అమయాకులు కాదు. దీంతో పొత్తుల పేరుతో ఆమె హడావిడి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలతో కలసి పోరాటం చేస్తామంటూ మరోసారి ఆమె హైలెట్ అయ్యారు. అయితే రెండు పూర్టీలు దాదాపుగా మొహం చాటేయడంతో షర్మిల ప్లాన్ వర్కవుట్ కాలేదు.