అందుకే కొట్టాడు.. కొడుక్కి వంతపాడిన సంజయ్
కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి, ఈ స్థాయిలో వంతపాడేవారిని ఇప్పుడే చూస్తున్నామంటూ బండి ఫ్యామిలీపై మండిపడుతున్నారు నెటిజన్లు.
తోటి విద్యార్థిపై యూనివర్శిటీ కాంపౌండ్ లోనే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆ విద్యాసంస్థ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కొడుక్కి వంత పాడేందుకు రాత్రి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు బండి సంజయ్. తన కొడుకు జీవితంతో రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కొట్టినోడు, కొట్టించుకున్నోడు కలసిపోయారు కదా..
బండి భగీరథ్ చేతిలో దెబ్బలు తిన్న కుర్రాడు రాత్రి 11 గంటల సమయంలో ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. భగీరథ్ స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని, అందుకే వాళ్లు తనపై చేయి చేసుకున్నారని, ఇప్పుడు అందరూ కలసిపోయామని, తమ మధ్య ఏమీ లేదని, ఇప్పుడెందుకు ఆ వీడియో బయటపెట్టారని ప్రశ్నించాడు. ఈ వీడియో పక్కా స్క్రిప్ట్ ప్రకారం రెడీ అయిందని సోషల్ మీడియాలో కౌంటర్లు పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి ఆ స్క్రిప్ట్ లో నెక్స్ట్ సీన్ ప్రకారం బండి సంజయ్ తెరపైకి వచ్చారని అంటున్నారు.
పిల్లల జీవితాలతో ఆడుకుంటారా..?
తన కొడుకు బండి భగీరథ్ వ్యవహారాన్ని రాజకీయాలకు ముడిపెట్టి విమర్శలు చేశారు బండి సంజయ్. తనతో రాజకీయం చేతకాక తన కొడుకుని తెరపైకి తెచ్చారని, పాత వీడియోలను ఇప్పుడు బయటపెట్టి కేసులు నమోదు చేయించారని మండిపడ్డారు. తాను తప్పు చేశానంటూ దెబ్బలు తిన్న విద్యార్థి ఒప్పుకున్నాక కూడా ఇంకా కేసెందుకని లాజిక్ తీశాడు సంజయ్. పిల్లలు, పిల్లలు కొట్లాడుకుని కలసిపోతారని.. ఇందులో కేసు పెట్టియ్యాల్సిన అవసరం ఏమొచ్చిందని, కంప్లయింట్ ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండ్రీకొడుకులపై కౌంటర్లు..
కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి, ఈ స్థాయిలో వంతపాడేవారిని ఇప్పుడే చూస్తున్నామంటూ బండి ఫ్యామిలీపై మండిపడుతున్నారు నెటిజన్లు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బండి సంజయ్ ని సద్దాం హుస్సేన్ తో పోల్చారు, ఆయన కొడుకు వ్యవహారం సద్దాం కొడుకులాగా ఉందన్నారు. మొత్తమ్మీద బండి ఫ్యామిలీ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. బీజేపీ అధిష్టానం ఇలాంటి గూండారాజ్ ని ప్రోత్సహిస్తుందా అనే విమర్శలు వినపడుతున్నాయి. బండి సంజయ్ సమర్థింపులు మరింత సంచలనంగా మారాయి.