Telugu Global
Telangana

అతి విశ్వాసమా.. ఆత్మ విశ్వాసమా..? బండి వ్యాఖ్యల మర్మమేంటి..?

బండి మాత్రం తమకు తామే పోటీ, తమకు కాంగ్రెస్సే పోటీ అంటూ స్టేట్ మెంట్లిస్తున్నారు. కరీంనగర్ లో అసమ్మతి సెగను తట్టుకోడానికే ఆయన ఇలా ముందస్తు హడావిడి చేస్తున్నారని అంటున్నారు స్థానిక నేతలు.

అతి విశ్వాసమా.. ఆత్మ విశ్వాసమా..? బండి వ్యాఖ్యల మర్మమేంటి..?
X

ఎంపీగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్ వ్యవహారం ఇప్పుడు తేడాకొట్టేసింది. కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత బండిపై చాలామంది సింపతీ చూపించారు, బండిని అనవసరంగా మార్చేశారని అనుకున్నారు. తీరా బండి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయే సరికి.. ఆయన తెలంగాణలో బీజేపీని గెలిపించడం పెద్ద జోక్ అని తేలిపోయింది. దీంతో సొంత నియోజకవర్గంలోనే ఆయనకు అసమ్మతి సెగ తగిలింది. వచ్చే ఎన్నికల్లో బండికి కరీంనగర్ ఎంపీ సీటు ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం సమావేశమై తీర్మానం చేసింది. ఈ దశలో బండి బయటకొచ్చారు, వైరి వర్గాలపై మరింత ఘాటుగా విమర్శలు చేస్తూ ఆయన హడావిడి చేస్తున్నారు.

తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇంకా పూర్తి స్థాయి హడావిడి మొదలుపెట్టలేదు కానీ, బండి సంజయ్ మాత్రం ప్రతిరోజూ వార్తల్లో వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్ట్ లు సీజ్ చేయాలంటూ హాట్ కామెంట్ చేశారు. తెలంగాణలో ఇక బీఆర్‌ఎస్‌ గల్లేంతనన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య మాత్రమే పోటీ వుంటుందన్నారు. కరీంనగర్ లోక్‎ సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన బీఆర్‌ఎస్‌ ని టార్గెట్‌ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ‘ఖేల్‌ ఖతమ్‌ దుకాణం బంద్‌’ అన్నారు. బీఆర్ఎస్ నేతల పాస్ పోర్ట్ లు సీజ్ చేయకపోతే వారు దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు బండి.

పోటీ ఎవరెవరి మధ్య..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఈటల రాజేందర్ సైతం.. రిజల్ట్ కి ముందే తాము అధికారంలోకి రాలేమని చేతులెత్తేసిన పరిస్థితి. గతం కంటే సీట్లు పెరగడం మాత్రమే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ఈ దశలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలంటూ బండి సంజయ్ ఎక్కడలేని హడావిడి చేస్తున్నారు. తమకు ప్రత్యర్థి కాంగ్రెస్సేనంటూ తేల్చి చెబుతున్నారు. అసెంబ్లీ అయినా, లోక్ సభ అయినా తెలంగాణలో బీజేపీని ఎవరు లెక్కలోకి తీసుకుంటారనేదే ఇప్పుడు అసలు సమస్య. కాంగ్రెస్ గెలిచిన ఉత్సాహంలో ఉంది, లోక్ సభ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలనే ఆశిస్తోంది. బీఆర్ఎస్ ఓటమి భారంతో మరింత కసిగా పనిచేయాలని భావిస్తోంది. మెజార్టీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని, తెలంగాణపై తమ పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటోంది. ఈ దశలో బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే బండి మాత్రం తమకు తామే పోటీ, తమకు కాంగ్రెస్సే పోటీ అంటూ స్టేట్ మెంట్లిస్తున్నారు. కరీంనగర్ లో అసమ్మతి సెగను తట్టుకోడానికే ఆయన ఇలా ముందస్తు హడావిడి చేస్తున్నారని అంటున్నారు స్థానిక నేతలు.

First Published:  17 Dec 2023 7:58 AM IST
Next Story