Telugu Global
NEWS

బండి సంజయ్, గొంతు పెగలదా ? ఇది సరైంది కాదని దేవుడన్నకు చెప్పవా ?

వాక్ స్వేచ్చ గురించి, మానవహక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికలపై ఉపాన్యాసాలు ఇస్తూ ఉంటారు.

బండి సంజయ్, గొంతు పెగలదా ? ఇది సరైంది కాదని దేవుడన్నకు చెప్పవా ?
X

వాక్ స్వేచ్చ గురించి, మానవహక్కుల గురించి, ప్రజాస్వామ్యం గురించి ప్రధాని మోడీ అంతర్జాతీయ వేదికలపై ఉపాన్యాసాలు ఇస్తూ ఉంటారు. వాక్ స్వేచ్చ గురించి ఇతర దేశాలతో కలిసి అంతర్జాతీయ ప్రకటనలపై సంతకాలు చేస్తూ ఉంటారు. ఇక ఆయన శిష్యులు, బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మాటలు, మతోన్మాద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. తుపాకులు, కత్తులు, చంపుతాం, నరుకుతాం అనే మాటల మించి కిందికి దిగరు.

ఇక తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర బీజేపీ నాయకులు మతాల మధ్య చిచ్చురేపే మాటలేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై అనరాని మాటలు అంటూ ఉంటారు. ఆధారాలు లేని ఆరోపణలు రోజుకొకటి చేస్తూనే ఉంటారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. పోస్టర్లు వేస్తారు. అవి కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా. మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తీసేస్తే వెంటనే రచ్చమొదలు పెడతారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, వాక్ స్వాతంత్య్రం లేదని గుండెలు బాదుకుంటారు. మరి వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్నదేంటి ? నిజంగా ఆయా రాష్ట్రాల్లో వాక్ స్వాతంత్య్రం ఉందా ? తెలంగాణలో పర్మిషన్ లేకుండా డిజిటల్ బోర్డులు పెడితే మున్సిపాల్టీ వాళ్ళు తీసేస్తున్నారంతే. మహా అంటే జరిమానాలు విధిస్తున్నారు. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసులు బనాయిస్తున్నారు. జైళ్ళకు పంపుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లో మూడురోజుల క్రితం జరిగిన ఓ సంఘటన బీజేపీ ప్రజాస్వామ్య మాటల డొల్లతనాన్ని బహిర్గతం చేస్తుంది. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మారుమోగి పోయింది. మోదీ ప్రభుత్వం దేశానికి చేసిన నష్టాలను వివరిస్తూ నెటిజనులు సోషల్ మీడియాలో విమర్షలు గుప్పించారు. హైదరాబాద్ బైబై మోదీ ఫ్లెక్సీలతో నిండి పోయింది. ఈ ప్రచారంతో ఉత్తేజం పొందిన ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు యువకులు ప్రయాగ్‌ రాజ్‌ నగరం, బెలి రోడ్‌లోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్‌కు సమీపంలో బైబై మోదీ అని ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.


'వ్యవ‌సాయ చట్టాలు తీసుకవచ్చి నువ్వు అనేక మంది రైతుల ప్రాణాలు తీశావు' 'కాంటాక్ట్ ఉద్యోగాలతో యువత కలలను చిదిమేశావు ' అని ఆ ఫ్లెక్సీల్లో ప్రింట్ చేశారు.

ఇందులో యూపీ ప్రభుత్వానికి చట్టవ్యతిరేకత కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఓనర్‌ అభేయ్‌ కుమార్‌ సింగ్‌, కార్యక్రమ నిర్వహకుడు అనికేత్‌ కేసరి, కాంట్రాక్టర్‌ రాజేశ్‌ కేసర్వాని, కార్మికులు శివ, నంక అలియాస్‌ ధర్మేంద్రలను అరెస్టు చేశారు. ఐపీసీలోని 153బీ, 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపారు. ఈ హోర్డింగ్‌ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్‌ ఇచ్చిన వ్యక్తిని సాయిగా గుర్తించినట్లు డిప్యూటీ ఎస్పీ అజిత్‌ సింగ్‌ చెప్పారు. అతడు సికింద్రాబాద్‌కు చెందిన వ‍్యక్తి అని, టీఆర్‌ఎస్‌ మద్దతుదారు అని తెలిపారు. సాయి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

మరి ఈ కేసులపై, అరెస్టులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కానీ, ప్రజాస్వామ్యం, వాక్ స్వాతత్య్రం అని క్లాసులు చెప్పే ప్రధాని కానీ మాట్లాడరా ? తెలంగాణలో అప్రజాస్వామిక పాలన అంటూ ప్రతిరోజూ ధ్వజమెత్తే బండి సంజయ్ యూపీలోని వారి డబల్ ఇంజన్ పాలనలోని ప్రజాస్వామ్యం గురించి కనీసం మాట్లాడే సాహసం చేయరా ? ఇలా చేయడం సరైనది కాదని దేవుడన్నకు చెప్పరా ?

First Published:  13 July 2022 10:23 AM GMT
Next Story