Telugu Global
Telangana

TSPSC ఎలా నడుస్తుందో కూడా తెలియ‌ని అజ్ఞాని బండి సంజయ్ : కేటీఆర్

ప్ర‌భుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన లేని సంజయ్ ఎంపీ ఎలా అయిపోయాడో ఆశ్చర్యంగా ఉందని కేటీఆర్ అన్నారు.

TSPSC ఎలా నడుస్తుందో కూడా తెలియ‌ని అజ్ఞాని బండి సంజయ్ : కేటీఆర్
X

TSPSC రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

ప్ర‌భుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కనీస అవగాహన లేని సంజయ్ ఎంపీ ఎలా అయిపోయాడో ఆశ్చర్యంగా ఉందని కేటీఆర్ అన్నారు.

ధరణి పోర్టల్, టీఎస్‌పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టే ఉందని కేటీఆర్ అన్నారు. గతంలో కూడా తనపై అసత్య ఆరోపణలు చేసి సంజయ్ బొక్కబోర్లా పడ్డారని, పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారన్నారని మంత్రి అన్నారు. అయినా బుద్ది రాని బండి సంజయ్ తనకేమాత్రం సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పద్దతి అలాగే కొనసాగితే క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందల సార్లు ప్రశ్నా పత్రాలు లీకయ్యాయని, మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడా అనేక సార్లు పేపర్లు లీకయ్యాయని, జాతీయ స్థాయి ఎగ్జామ్స్ పేపర్స్ కూడా లీకయ్యాయని మరి ఇందుకు మోడీ కూడా రాజీనామా చేయాలా అని కేటీఆర్ ప్రశ్నించారు.

రాజకీయ దురుద్దేశంతో బీజేపీనే ఈ పేపర్ లీకేజీ వ్యవహారానికి పాల్పడిందని కేటీఆర్ విమర్శించారు. తన రాజకీయ స్వార్దం కోసం వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తున్న బండి సంజయ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యువతను కేటీఆర్ కోరారు.

First Published:  17 March 2023 6:43 PM IST
Next Story