చంద్రబాబుకు బండి సంజయ్ షాక్
చంద్రబాబు ఎత్తుగడను గ్రహించిన బండి టీడీపీతో పొత్తు లేదంటు స్పష్టంగా ప్రకటించేశారు. బండి ప్రకటనతో చంద్రబాబు ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ప్రయాణం ఎలాగుంటుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
బీజేపీతో ఏపీలో పొత్తుల విషయంలో ఏవేవో ప్లాన్లు వేస్తున్న చంద్రబాబు నాయుడుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పెద్ద షాకే ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీకి పొత్తుండదని బండి స్పష్టంగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్ధితుల్లోను పొత్తు ఉండదన్న విషయాన్ని నేతలు, కార్యకర్తలంతా గుర్తుపెట్టుకోవాలని గట్టిగా చెప్పారు. ఇంతకీ అసలీ విషయాన్ని బండి ఎందుకు ప్రకటించారంటే విజయశాంతి కారణంగానే. పార్టీ ఆధ్వర్యంలో విస్తారకుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారంటు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ప్రస్తావించారు. టీడీపీతో పొత్తంటే తమ గొయ్యిని తాము తవ్వుకోవటమే అన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పరిస్ధితి ఏమైందో అందరు గుర్తుపెట్టుకోవాలని విజయశాంతి గుర్తుచేశారు. కాబట్టి టీడీపీతో ఎట్టి పరిస్ధితుల్లోను బీజేపీ పొత్తు పెట్టుకోకూడదని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు.
ఇదే విషయమై బండి మాట్లాడుతూ టీడీపీతో బీజేపీకి ఎట్టి పరిస్ధితుల్లోను పొత్తుండదని ప్రకటించారు. బండి తాజా ప్రకటన చంద్రబాబుకు షాకిచ్చేదే అన్నట్లుగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో టీడీపీకి ఇంకా పట్టుందని చూపించేందుకే ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించారు. తెలంగాణలో టీడీపీకి ఇంకా పట్టుందని చూపించి, పొత్తు పెట్టుకుని తర్వాత ఏపీలో పొత్తుకు బీజేపీని ఒప్పించాలన్నది చంద్రబాబు ప్లాన్. చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తెలంగాణలోని కమ్మ సంఘం ఖమ్మం బహిరంగసభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.
చంద్రబాబు ఎత్తుగడను గ్రహించిన బండి టీడీపీతో పొత్తు లేదంటు స్పష్టంగా ప్రకటించేశారు. బండి ప్రకటనతో చంద్రబాబు ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ప్రయాణం ఎలాగుంటుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీ ఒంటరిగానే పోటీ చేయాలి. గత అనుభవం కారణంగా మళ్ళీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని ఎవరు అనుకోవటం లేదు. టీడీపీతో కలిసి పోటీ చేసేంత ధైర్యం జనసేన చేస్తుందని ఎవరు అనుకోవటం లేదు. మరీ పరిస్ధితుల్లో చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి.