అబ్బెబ్బే.. అది సామెత..! విచారణలో బండి కవరింగ్ లు
తెలంగాణలో ప్రచారంలో ఉన్న ఓ సామెతను మాత్రమే చెప్పానని, తానేమీ తప్పు చేయలేదని కమిషన్ ముందు వివరణ ఇచ్చారట బండి సంజయ్.
ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కమిషన్ ముందు తానేం చెప్పాననే విషయాన్ని మీడియాకు వివరించారు బండి.
అది సామెత..
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్.. కమిషన్ ముందు కూడా తన తప్పు ఒప్పుకోలేదని తెలుస్తోంది. తాను తెలంగాణలో ప్రచారంలో ఉన్న ఓ సామెతను మాత్రమే చెప్పానని, తానేమీ తప్పు చేయలేదని కమిషన్ ముందు వివరణ ఇచ్చారట బండి సంజయ్. కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదని, తానెవరినీ కించపరచలేదని అన్నారు. తెలంగాణలో ఒక సామెతను మాత్రమే వాడానని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే మహిళా కమిషన్ ముందు హాజరయ్యానని తెలిపారు బండి.
బండికి వ్యతిరేకంగా ఆందోళన..
కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. బండికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న విచారణకు రావాల్సి ఉండగా, పార్లమెంట్ సమావేశాలు సాకుగా చూపి రాలేనన్నారు, దీంతో విచారణ ఈరోజుకి వాయిదా పడింది. ఈరోజు ఉదయం బుద్ధ భవన్ లోని మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు బండి సంజయ్. బీజీపీ లీగల్ సెల్ మహిళా న్యాయవాదులతో కలిసి కమిషన్ కార్యాలయానికి వెళ్లారు.
విచారణ సందర్భంగా బుద్ధ భవన్ వద్ద బండి సంజయ్ కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు మహిళా కమిషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.