రేవంతన్నా..! నా గుండుతో నీకేం పని..?
సీఎం ఉపయోగిస్తున్న భాష జుగుప్సాకరంగా ఉందని, మేధావి వర్గం, సామాన్య ప్రజల్లో సీఎం మాటలపై చర్చ జరుగుతోందన్నారు బండి సంజయ్.
వ్యక్తిగతంగా తనను కించ పరుస్తున్నారని, తన రూపు రేఖల్ని హేళన చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఆరు గ్యారెంటీల గురించి అడిగితే తన గుండు గురించి హేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. తాను కరీంనగర్ అభివృద్ధికోసం పోరాటాలు చేశానని, నిధులు తెచ్చానని చెప్పుకొచ్చారాయన. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బండి సంజయ్.
"రేవంతన్నా, నేను ఆరు గ్యారెంటీల సంగతి అడిగితే, నువ్వు గుండు, అరగుండు అంటూ హేళనగా మాట్లాడుతున్నావ్.. కరీంనగర్ అభివృద్ధికోసం నేను తెచ్చిన నిధులు నీ కళ్లకు కనిపించడం లేదా..?" అని ప్రశ్నించారు బండి సంజయ్. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని, ప్రజలు ఆ భాషను అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. సీఎం ఉపయోగిస్తున్న భాష జుగుప్సాకరంగా ఉందని, మేధావి వర్గం, సామాన్య ప్రజల్లో సీఎం మాటలపై చర్చ జరుగుతోందన్నారు బండి సంజయ్.
తెలంగాణకు బీజేపీ తీసుకొచ్చింది గాడిద గుడ్డు అంటూ కాంగ్రెస్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. గాడిద గుడ్డు అంటూ ఓ నమూనా తీసుకొచ్చి మరీ ప్రజలకు చూపెడుతున్నారు. ఈ సెటైర్లపై కూడా బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. గాడిద గుడ్డు, అరగుండు, గుండు సున్నా అంటూ వ్యక్తిగతంగా కించపరచడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని డ్రామాలాడినా, ఎంత హేళనగా మాట్లాడినా.. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని, ప్రజలు కాంగ్రెస్ ని తిరస్కరిస్తున్నారనడానికి అదే పెద్ద నిదర్శనం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆరు గ్యారెంటీలపై చర్చించాలని, వాటిని ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.