Telugu Global
Telangana

ముస్లింలకు మేలు జరిగితే బండికి కడుపుమంట ఎందుకు..?

రజకులకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తూ, ముస్లిం వర్గంలోని కొందరికి మేలు జరిగే నిర్ణయం తీసుకుంటే తప్పేముందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి.

ముస్లింలకు మేలు జరిగితే బండికి కడుపుమంట ఎందుకు..?
X

కుల వృత్తులు కేవలం ఆయా కులాల వారు మాత్రమే చేయాలనే నిబంధన ఏదీ లేదు. ఒకవేళ వారు ఆ వృత్తులకే పరిమితం కావాలంటే మాత్రం ఆధునిక కాలంలో అలాంటివారి భావజాలం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం బండి సంజయ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అసలేం జరిగింది..?

తెలంగాణ ప్రభుత్వం ముస్లిం వర్గంలో బట్టలు ఉతికే వృత్తిలో ఉన్నవారికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ముస్లిం దోభీ ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింపచేయబోతోంది. ఈ నిర్ణయాన్ని ముస్లిం వర్గాలు స్వాగతించాయి. అయితే కేవలం ముస్లింలకు ప్రయోజనం కలుగుతుందన్న కారణంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ పథకాన్ని తప్పుబడుతున్నారు. ఇక్కడ ఆయన చెప్పిన లాజిక్ కూడా విమర్శలకు కారణం అవుతోంది. ముస్లింలకు విద్యుత్ రాయితీ ఇస్తే, అదే వృత్తిని నమ్ముకున్న రజకులకు అన్యాయం జరుగుతుందన్నారు బండి. కేవలం ఒవైసీని సంతృప్తి పరిచేందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని టార్గెట్ చేశారు.

తప్పేంటి..?

ముస్లిం వర్గంలో కొంతమంది పేదలు దోభీ పని చేస్తుంటారు. లాండ్రీ షాపులు కూడా నిర్వహిస్తుంటారు. అలాంటి వారికి కరెంటు బిల్లులో రాయితీ ఇస్తే అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు సామాన్య పౌరులు. రజకులకు రాయితీల విషయంలో అన్యాయం చేస్తే అప్పుడు ప్రభుత్వాన్ని తప్పుబట్టాలి. ఆ వృత్తిలో ఉన్న రజకులకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తూ, ముస్లిం వర్గంలోని కొందరికి మేలు జరిగే నిర్ణయం తీసుకుంటే తప్పేముందని అంటున్నారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి.


First Published:  20 Sept 2023 3:58 PM IST
Next Story