Telugu Global
Telangana

వివేక్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన సుమన్.. ఎందుకంటే..?

కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.. సహచరుల అకౌంట్స్ లోకి డబ్బులు జమ చేస్తున్నారని, వాటిని గ్రామాల్లో పంచి పెడుతున్నారని చెప్పారు. ఆయన అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయాలని సీఈఓని కోరామన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్.

వివేక్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన సుమన్.. ఎందుకంటే..?
X

తెలంగాణ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎలక్షన్ యాడ్స్ పై ఫిర్యాదులు రావడంతో కొన్నిటిని నిలిపివేశారు అధికారులు. మరోవైపు నామినేషన్ల విషయంలో కూడా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు డబ్బుల పంపిణీ మొదలైందంటూ కంప్లైంట్లు వినపడుతున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి విచ్చలవిడిగా డబ్బులు పంచిపెడుతున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని కలిసి వివేక్ పై ఫిర్యాదు చేశారు. ఈడీ, ఐటీ విభాగాలకు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే బాల్క సుమన్.

ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగొచ్చిన వివేక్ వెంకట స్వామి తన చిరకాల ప్రత్యర్థి 2014లో తనను లోక్ సభ ఎన్నికల్లో ఓడించిన బాల్క సుమన్ పై చెన్నూరులో పోటీకి దిగారు. ఈసారి ఎలాగైనా చెన్నూరులో విజయం సాధించాలని ప్లాన్లు గీస్తున్నారు వివేక్. ఈ దశలో ఆయన డబ్బులు పంచిపెడుతున్నారని సుమన్ ఆరోపిస్తున్నారు. తన సహచరుల అకౌంట్స్ లోకి డబ్బులు జమ చేస్తున్నారని, వాటిని గ్రామాల్లో పంచి పెడుతున్నారని చెప్పారు. ఆయన అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయాలని సీఈఓని కోరామన్నారు.

వివేక్ కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్ పై నిఘా పెట్టాలని ఎన్నికల కమిషన్ సీఈఓని కోరారు సుమన్. పెట్రోల్ బంకుల యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్, రైస్ మిల్స్, సిమెంట్, స్టీల్ కంపెనీల వాళ్ల అకౌంట్లలోకి హైదరాబాద్ నుంచి డబ్బులు పంపిస్తున్నారని, వారి ద్వారా ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వివేక్ కుటుంబం చేస్తున్న పాపంలో పాలు పంచుకోవద్దని వ్యాపారులను కోరారు ఎమ్మెల్యే సుమన్. వివేక్ కి సంబంధించిన టీవీ ఛానెళ్లలో పనిచేసే ఉద్యోగులు చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ధన రాజకీయాలు చేసే వివేక్ కి బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు సుమన్.

First Published:  15 Nov 2023 10:05 AM GMT
Next Story