బాలయ్య షో లో కంగన 'పద్మశ్రీ' వివాదం, జయసుధ ఏమన్నారంటే..?
కంగనా రనౌత్ కి పద్మశ్రీ ఇవ్వడాన్ని తాము తప్పుబట్టడంలేదని, కానీ సీనియర్లందర్నీ పక్కనపెట్టి, అంత చిన్న వయసులో ఆమెకు పద్మ పురస్కారం ఇవ్వడమేంటని నిలదీశారు జయసుధ.
తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు ఎందుకు రావు. కైకాల సత్యనారాయణ మరణం తర్వాత ఈ ప్రశ్న మరింత బలంగా వినపడుతోంది. కైకాల వంటి మహా నటుడికి ఒక్క కేంద్ర పురస్కారం కూడా ఎందుకు దక్కలేదు. నిన్నగాక మొన్న వచ్చిన కంగనా రనౌత్ వంటి హీరోయిన్లకు పద్మశ్రీ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి..? నటనే కొలమానమా..? లేక ప్రభుత్వానికి భజన కూడా చేయాలా..? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ అన్ స్టాపబుల్ తాజా ఎపిసోడ్ లో కూడా ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. సహజ నటిగా పేరున్న జయసుధకు ఇప్పటి వరకూ ఒక్క కేంద్ర పురస్కారం కూడా రాలేదు.. కారణం ఏంటి..? అని బాలకృష్ణ అడిగారు, అదే సమయంలో కంగనా రనౌత్ విషయం కూడా ఆయన ప్రస్తావించారు. దీనిపై జయసుధ రియాక్ట్ అయ్యారు.
జయసుధ, జయప్రద, రకుల్ ప్రీత్ సింగ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ తాజా ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు సీనియర్ నటీమణులతో ఈ షో నడిపించిన బాలయ్య పురస్కారాల ప్రస్తావన తెచ్చారు. దీంతో జయసుధ, జయప్రద తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. కంగనా రనౌత్ కి పద్మశ్రీ ఇవ్వడాన్ని తాము తప్పుబట్టడంలేదని, కానీ సీనియర్లందర్నీ పక్కనపెట్టి, అంత చిన్న వయసులో ఆమెకు పద్మ పురస్కారం ఇవ్వడమేంటని నిలదీశారు జయసుధ. అవార్డులు అడిగి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.
ఎన్టీఆర్ కి భారత రత్న కోసం ఎంతో ప్రయత్నించా..
పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి భారత రత్న రావాలని తాను చాలా ప్రయత్నాలు చేశానని, కానీ సాధ్యం కాలేదన్నారు జయప్రద. ఉత్తరాది వారికే ఎక్కువగా అవార్డులు, రివార్డులు వస్తాయని, ఆ విషయంలో దక్షిణాదిపై ఎప్పుడూ చిన్నచూపే ఉందని చెప్పారు. పద్మ పురస్కారాలు కూడా ఎక్కువగా ఉత్తరాది నటీనటుల్నే వరిస్తాయన్నారు. ప్రేక్షకుల దీవెనలకంటే పెద్ద పురస్కారమేదీ ఉండదన్నారు.
మొత్తమ్మీద పద్మ పురస్కారాల విషయంలో దక్షిణాదిపై కేంద్రానిది ఎప్పుడూ సవతి తల్లి ప్రేమేనని పదే పదే రుజువవుతోంది. బీజేపీకి బాకాలూదే కంగనా రనౌత్ కి పద్మ పురస్కారం ఇచ్చి ప్రోత్సహించిన కేంద్రం, అంతకంటే సీనియర్ నటుల్ని ఎందుకు మరచిపోయిందనేది ఎప్పటికీ ప్రశ్నార్థకమే.