Telugu Global
Telangana

కేసీఆర్ కి ద్రోహం చేయను.. బీఆర్ఎస్ తోనే నా ప్రయాణం

తాను పార్టీ మారడం లేదని, చివరి వరకు తన ప్రయాణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే అని చెప్పారు బాజిరెడ్డి.

కేసీఆర్ కి ద్రోహం చేయను.. బీఆర్ఎస్ తోనే నా ప్రయాణం
X

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడంతో కొంతమంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఆల్రడీ ఒక బ్యాచ్ లోక్ సభ టికెట్ల హామీతో బీజేపీలో చేరింది. కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్లగా, మరికొందరు గోడమీద ఉన్నారు, ఆల్రడీ సీఎం రేవంత్ రెడ్డిని కలసి కర్చీఫ్ వేసి ఉంచారు. మిగిలినవారిలో కొందరిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏ క్షణమైనా వారు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పై కూడా ఇలాంటి పుకార్లు మొదలయ్యాయి. ఆయన నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని, కాంగ్రెస్ హామీ మేరకు కండువా కప్పుకోబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఖండించారు బాజిరెడ్డి. తాను పార్టీ మారట్లేదని స్పష్టం చేశారు.

తాను పార్టీ మారడం లేదని, చివరి వరకు తన ప్రయాణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే అని చెప్పారు బాజిరెడ్డి. తాను కాంగ్రెస్ నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు, నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్న‌ట్లు కొన్ని టీవీ ఛానెల్స్‌లో ఫేక్ ప్ర‌చారం జరిగిందన్నారాయన. ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ త‌న‌కు మూడు సార్లు టికెట్ ఇచ్చారని, నిజామాబాద్ రూరల్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు రెండు సార్లు గెలిపించారని, గత ఎన్నిక‌ల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు బాజిరెడ్డి. పార్టీ మారితే బీఆర్ఎస్‌కు ద్రోహం చేసినట్టవుతుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీకి టికెట్ వ‌చ్చినా, రాకపోయినా కేసీఆర్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు.

బీఆర్ఎస్ ని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ టికెట్లు ఎర వేస్తూ కీలక నేతల్ని తమవైపు తిప్పుకుంటున్నాయి. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు బీజేపీలో బెడిసికొట్టింది, వలస నేతలకు పెద్దపీట వేయడంతో అసలు నేతలు అలిగారు. కాంగ్రెస్ కూడా నిజామాబాద్ సీటు విషయంలో బాజిరెడ్డిని బరిలోకి దింపాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ ఫేక్ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే బాజిరెడ్డి ఖండించడం విశేషం. తాను బీఆర్ఎస్ తోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

First Published:  12 March 2024 10:05 AM IST
Next Story