Telugu Global
Telangana

తిరగబడ్డ మునుగోడు.. రాజగోపాల్ రెడ్డి పరార్..

రాజగోపాల్ రెడ్డిని మాత్రం మొహంపైనే చీదరించుకుంటున్నారు. గో బ్యాక్ అంటూ తరుముకుంటున్నారు. ముందు ముందు ఇలాంటి సత్కారాలు అన్ని గ్రామాల్లో ఆయనకు ఎదురు కాబోతున్నాయని తెలుస్తోంది.

తిరగబడ్డ మునుగోడు.. రాజగోపాల్ రెడ్డి పరార్..
X

మునుగోడు తిరగబడింది. కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డిపై మునుగోడు ప్రజలు తిరగబడ్డారు. గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి కారులో వచ్చినట్టే వచ్చి పరారయ్యారు. ఊహించని పరిణామంతో ఆయన షాకయ్యారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వ్యవహారం బయటపడిన తర్వాత ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగిందనేది వాస్తవం. దీనికి ప్రతిరూపమే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ప్రజలు తరమడం.

మునుగోడులో తాజాగా పర్యటనకు వచ్చారు రాజగోపాల్ రెడ్డి. రాత్రివేళ ఆయన కారులో మందీమార్బలంతో వచ్చారు. గతంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన ప్రాంతాలు అవి. అప్పుడాయన కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు ఫిరాయించి బీజేపీ కండువా కప్పుకుని అక్కడికి వచ్చారు. వచ్చే ముందే బీజేపీ తోరణాలు కూడా అక్కడ కట్టించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాంట్రాక్ట్ డబ్బులకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి అంటూ ప్రజలు నినాదాలు చేశారు. గో బ్యాక్, గో బ్యాక్ అంటూ నినదించారు. వెంట‌బ‌డి త‌ర‌మ‌డంతో కారులోనుంచి దిగకుండానే ఆయన పలాయనం చిత్తగించారు.

పల్లెల్లో రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది కేవలం ప్రచారం కాదని, వాస్తవం అని ఈ ఘటనతో తేలిపోయింది. మునుగోడు ఓట్లను నోట్లతో కొనేందుకు ఆయన పక్కా ప్రణాళికతో వస్తున్నారు. కానీ అది అన్నిచోట్లా ఫలించట్లేదు, కొన్నిచోట్ల ఇలా వికటిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఎక్కడా ఇలాంటి వ్యతిరేకతలు లేవు, ఓట్లు వేసే ఉద్దేశం ఉన్నా, మనసులో కోపం ఉన్నా కూడా ప్రజలు బయటపడటం లేదు. అందర్నీ ఆదరిస్తున్నారు. మీకే మా ఓటు అని చెప్పి పంపించేస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డిని మాత్రం మొహంపైనే చీదరించుకుంటున్నారు. గో బ్యాక్ అంటూ తరుముకుంటున్నారు. ముందు ముందు ఇలాంటి సత్కారాలు అన్ని గ్రామాల్లో ఆయనకు ఎదురు కాబోతున్నాయని తెలుస్తోంది. అందుకే ఢిల్లీ టీమ్ కూడా ప్రచారానికి కాస్త దూరంగానే ఉంటోంది.

First Published:  13 Oct 2022 9:47 AM IST
Next Story