ఆ ఫొటోలతో నరకం.. వరంగల్ లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ప్రీతి మరణ వార్త తర్వాత వరంగల్ లో మరో ర్యాగింగ్ మరణం అంటూ సోషల్ మీడియా హోరెత్తింది. రక్షిత అనే బీటెక్ విద్యార్థిని ఉరి వేసుకుని చనిపోవడంతో అందరూ అది ర్యాగింగ్ మరణం అంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే ఆ ఆత్మహత్యకు వేధింపులే కారణం అని తేలింది. టెన్త్ క్లాస్ చదివే రోజుల్లో పరిచయమైన ఓ స్నేహితుడు ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె చివరకు బలవన్మరణానికి పాల్పడిందని తేల్చారు పోలీసులు. అతడికోసం గాలిస్తున్నారు.
ప్రీతి మరణం అంటూ నిమ్స్ వైద్యులు ప్రకటించిన కాసేపటికే రక్షిణ మరణం వెలుగులోకి వచ్చింది. నర్సంపేటలో ఆమె బీటెక్ చదువుతోంది. భూపాలపల్లి ఆమె సొంత ఊరు. తల్లిదండ్రులు పబ్బోజు శంకర్, రమాదేవి. నర్సంపేట కాలేజీ హాస్టల్ లో ఉంటున్న ఆమె వరంగల్ రామన్నపేటలోని తన బాబాయి ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
భూపాలపల్లిలో టెన్త్ క్లాస్ చదివే రోజుల్లో ఆమెకు పరిచయమైన రాహుల్ అనే కుర్రాడు కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. చివరకు తల్లిదండ్రుల సాయంతో రక్షిత పోలీసుల్ని ఆశ్రయించింది. రాహుల్ కి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతడిలో మార్పు రాలేదు. చివరకు వేధింపులు ఎక్కువ కావడంతో రక్షిత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.
శివరాత్రి తర్వాత రెండురోజులు కనిపించకుండా పోయిన రక్షిత చివరకు ఇల్లు చేరింది. ఆ తర్వాత ఆమెను హాస్టల్ లో వద్దని, రామన్నపేటలోని తన సోదరుడు ఇంటికి పంపించిన తండ్రి శంకర్ కాంట్రాక్ట్ పనుల నిమిత్తం జార్ఖండ్ వెళ్లారు. ఈలోగా ఘోరం జరిగిపోయింది. బాబాయి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రక్షిత. రాహుల్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.