8 గంటలసేపు విచారణ.. మళ్లీ రేపు రావాల్సిందే
ఈరోజు విచారణ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లారు అవినాష్ రెడ్డి. మళ్లీ రేపు ఉదయం 10.30 గంటలకు ఆయన సీబీఐ ఆఫీస్ కి రావాల్సి ఉంది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణ ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. కోర్టు తీర్పుతో ఆయన్ను అరెస్ట్ చేయరు అని తేలిపోయింది కాబట్టి ఎక్కడా మీడియా హడావిడి కనిపించలేదు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ విచారణకు హాజరయ్యారు అవినాష్ రెడ్డి. దాదాపు 8గంటలసేపు సుదీర్ఘ విచారణ జరిగింది. లోపల ఏం జరిగింది అనే విషయంలో బయటకు వినిపిస్తున్నవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే.
రేపు కూడా రావాల్సిందే..
ఈనెల 25వరకు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలివ్వడంతో.. సీబీఐ కూడా ప్రతిరోజూ ఆయన్ను విచారణకు రావాలని చెప్పింది. ఈరోజు విచారణ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లారు అవినాష్ రెడ్డి. మళ్లీ రేపు ఉదయం 10.30 గంటలకు ఆయన సీబీఐ ఆఫీస్ కి రావాల్సి ఉంది.
మరోవైపు వివేకా హత్య కేసులో అరెస్టు అయిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు విచారణకు హాజరయ్యారు. వారిద్దర్నీ దాదాపు ఐదున్నర గంటలసేపు ప్రశ్నించారు అధికారులు. వివేకా హత్యకు దారితీసిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. రిమాండ్ లో ఉన్న వారిద్దరినీ సీబీఐ కస్టడీకి కోరిన విషయం తెలిసిందే.