Telugu Global
Telangana

గువ్వలపై మళ్లీ దాడి

కాంగ్రెస్‌ దాడుల సంస్కృతిని అచ్చంపేట ప్రజలు అర్థం చేసుకొని ఆ పార్టీ నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే గువ్వల. అచ్చంపేట ప్రజల కోసం తాను చావడానికైనా సిద్ధమని చెప్పారు.

గువ్వలపై మళ్లీ దాడి
X

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై మరోసారి దాడి జరిగింది. ఇటీవల కారులో వెళ్తున్న ఆయన్ను వెంబడించి కాంగ్రెస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న గువ్వల తిరిగి ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. సోమవారం రాత్రి నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని కుమ్మరోనిపల్లి గ్రామంలో ప్రచారం చేస్తుండగా మళ్లీ ఆయనపై దాడి జరిగింది. కుమ్మరోనిపల్లి కాంగ్రెస్‌ కార్యకర్త తిరుపతయ్య ఇటుకరాయితో ఎమ్మెల్యే గువ్వలపై దాడి చేశాడు. ఎమ్మెల్యే చేతికి గాయం కాగా, పక్కనే ఉన్న ఆయన అనుచరుడికి కూడా దెబ్బ తగిలింది. దాడి చేసిన తిరుపతయ్యను గ్రామస్థులు పోలీసులకు పట్టించారు.

వరుస దాడులు..

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన మరువక ముందే ఎమ్మెల్యే గువ్వలబాలరాజుపై వరుసగా రెండుసార్లు దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల అచ్చంపేటలో స్వయంగా కాంగ్రెస్‌ నేత వంశీకృష్ణ రాయితో దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పెద్ద ప్రమాదం తప్పి, గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మరువకముందే మరోసారి ఎమ్మెల్యేపై దాడి జరిగంది.

పిచ్చోడి చేతిలో రాయి..!

దాడి చేసిన వ్యక్తిపేరు తిరుపతయ్య అని, అతడు కాంగ్రెస్ కార్యకర్త అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం అతడు తమ పార్టీ కార్యకర్త కాదని అంటున్నారు. తిరుపతయ్యకు మతి స్థిమితం లేదని, ఊరిలో చాలామందిపై అతడు రాళ్లదాడి చేశాడని, ఎమ్మెల్యే గువ్వలపై జరిగిన దాడి కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ వరుసదాడుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్‌ దాడుల సంస్కృతిని అచ్చంపేట ప్రజలు అర్థం చేసుకొని ఆ పార్టీ నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే గువ్వల. అచ్చంపేట ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, అచ్చంపేట ప్రజల కోసం తాను చావడానికైనా సిద్ధమని చెప్పారు గువ్వల.

First Published:  14 Nov 2023 8:14 AM IST
Next Story