బీఆర్ఎస్ ఎంపీకి కత్తిపోటు.. యూట్యూబ్ ఛానెల్ విలేకరి అరెస్ట్
హఠాత్తుగా ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. చేయి కలిపేందుకు దగ్గరకు వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆ దుండగుడు కత్తితో పొడిచి పారిపోయే ప్రయత్నం చేశాడు. పొట్టలో కత్తిపోటు దిగడంతో అక్కడికక్కడే కుప్పకూలారు ప్రభాకర్ రెడ్డి.
బీఆర్ఎస్ ఎంపీ, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి దుబ్బాక అసెంబ్లీ బరిలో నిలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచార పర్వంలో ఉండగా ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. కడుపులో తీవ్ర గాయాలవ్వడంతో ఆయన విలవిల్లాడుతూ కిందపడిపోయారు. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. తీవ్ర రక్తస్రావం కాగా.. ఆయన్ను ముందుగా గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు బయలుదేరారు.
అసలేం జరిగింది..?
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ పాస్టర్ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బయటకు వస్తున్నారు. ఈ సందర్భంలో హఠాత్తుగా ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. చేయి కలిపేందుకు దగ్గరకు వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆ దుండగుడు కత్తితో పొడిచి పారిపోయే ప్రయత్నం చేశాడు. పొట్టలో కత్తిపోటు దిగడంతో అక్కడికక్కడే కుప్పకూలారు ప్రభాకర్ రెడ్డి. అప్రమత్తమైన అనుచరులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
నిందితుడి పేరు దట్టని రాజు. మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు ఓ యూట్యూబ్ ఛానల్ లో విలేకరిగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. ఎంపీపై దాడి తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన రాజును బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీపై దాడి ఎందుకు చేశాడు, వ్యక్తిగత వైరం ఏమైనా ఉందా.. అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.