తెలంగాణలో కులగణన.. అసెంబ్లీ ఆమోదం
కులగణనకు తాము వ్యతిరేకం కాదని, అయితే చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలప్రదమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు.

తెలంగాణలో కులగణనకు శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కులగణన, సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై బీఆర్ఎస్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. అయితే చివరకు సభ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని స్పీకర్ ప్రకటించారు.
బిల్లు పెట్టండి మద్దతిస్తాం: కేటీఆర్
కులగణనకు తాము వ్యతిరేకం కాదని, అయితే చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలప్రదమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలని కోరారు. బిల్లు ప్రవేశపెడితే వెంటనే ఆమోదించుకుందామన్నారు.
చిత్తశుద్ధి ఉంటే చాలు బిల్లు అక్కర్లేదన్న ప్రభుత్వం
అయితే కులగణనకు బిల్లు అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కొట్టిపారేశారు. గత ప్రభుత్వం పదేళ్ల కిందట హడావుడిగా చేసిన సమగ్ర సర్వే వివరాలను నేటికీ బయటపెట్టలేదని గుర్తు చేశారు. మొత్తం మీద కులగణనకు అసెంబ్లీ ఆమోదం ప్రకటించింది.