Telugu Global
Telangana

12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

10,950 విలేజ్‌ లెవల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం

12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
X

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 12న ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. గురువారం సెక్రటేరియట్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఆరు గంటల పాటు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 12న అసెంబ్లీ, కౌన్సిల్‌ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు రెండు సభల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. బడ్జెట్‌ ఏ రోజు ప్రవేశ పెడుతారు.. పద్దులపై ఎన్ని రోజులు చర్చిస్తారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఉగాది పండుగ నుంచి భూభారతిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీని అమలు కోసం గ్రామస్థాయిలో 10,950 విలేజ్‌ లెవల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 33 సెలక్షన్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేశారు. పది జిల్లాల కోర్టులకు 55 పోస్టులు మంజూరు చేశారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు, ఫ్యూచర్‌ సిటీ బోర్డు ఏర్పాటు, నది జలాల సాధనపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. రేపటి ఢిల్లీ పర్యటన, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చామని, అది మినహా మిగతా మూడు స్థానాలను ఓసీ, బీసీ, ఎస్సీలకు కేటాయిస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడి కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు.

First Published:  6 March 2025 10:07 PM IST
Next Story