ట్విట్టర్‌లో ఆస్క్ కవిత.. నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు
ప్రతిపక్షాలు ఎక్కువగా మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. బలవంతురాలిని కాబట్టే టార్గెట్ చేస్తున్నారని సమాధానమిచ్చారు కవిత.
వచ్చే ఎన్నికల్లో BRS 95 నుంచి 100 స్థానాలు గెలవడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత. ట్విట్టర్‌లో `ఆస్క్ కవిత` పేరుతో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బాధ్యత గల ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని ప్రజలకు కవిత పిలుపునిచ్చారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఖాయం అని సర్వేలు చెప్తున్నాయి కదా అని ఓ నెటిజన్ అడగ్గా.. 2018లోనూ ఇలానే చేశారని కానీ, బీఆర్ఎస్ మాత్రం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు.
ప్రతిపక్షాలు ఎక్కువగా మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. బలవంతురాలిని కాబట్టే టార్గెట్ చేస్తున్నారని సమాధానమిచ్చారు కవిత. జీవన్ రెడ్డి లిక్కర్ క్వీన్ అని విమర్శించడంపై ఏమంటారని అడగ్గా.. అవును రాజకీయాల్లో బంటులా కాకుండా రాణిలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానంటూ ఆన్సర్ చెప్పారు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఎన్నికలు పూర్తయ్యే వరకు వస్తారని, ఏదో మాట్లాడి వెళ్తారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో వారి పాత్ర శూన్యమన్నారు కవిత.
యువతకు ఎలాంటి సందేశం ఇస్తారని అడగ్గా.. రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ 33శాతానికి పెంచాలని పోరాడిన బీఆర్ఎస్.. తక్కువ సీట్లు ఎందుకు ఇచ్చిందని ఓ యువతి ప్రశ్నించగా.. మహిళా రిజర్వేషన్ల పెంపును తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిందన్నారు. కాంగ్రెస్ సభలో మౌనం పాటించిందని.. బీజేపీ పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి మహిళలను మోసం చేసిందన్నారు.
ఇక ఏపీలో చంద్రబాబు అరెస్టు వ్యవహారంపైనా స్పందించారు కవిత. ఈ వయసులో చంద్రబాబు అరెస్టు కావడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు ఫ్యామిలీ బాధను అర్థం చేసుకోగలనని.. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నానని సమాధానం ఇచ్చారు.