ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి మోడీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతల భయమన్న సీఎం

తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన చనిపోతే మాజీ సీఎం కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని విమర్శించారు. టెక్స్‌టైల్ వర్సిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా ఆయన పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతన్నలను ఇస్తున్న ప్రాధాన్యాన్ని నేతలకు సైతం ఇస్తున్నామన్నారు. నన్ను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నాను. నన్ను గుండెల్లో పెట్టుకున్న మీ రుణం తీర్చుకుంటాను అని సీఎం తెలిపారు. నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని భావించాను. అందుకే మహిళా సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లను రాష్ట్ర నేతన్నలకు ఇస్తున్నామని చెప్పారు.
1939 తర్వాత కులగణన ఇప్పటివరకు మళ్లీ జరగలేదు. మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. భారత్ జోడో యాత్రలో బలహీనవర్గాల కష్టాలను రాహుల్ గాంధీ చూశారు. కులగణణ చేసి జనాభా దామాషాలో బీసీలకు న్యాయం నిర్వహించాం. కులగణన నచ్చనివారు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరూ ముందు రావడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి మోడీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతల భయం అని సీఎం అన్నారు.