Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో కొత్త కొట్లాట.. ఆసిఫాబాద్‌ టికెట్ కోసం లంబాడాలు వర్సెస్ ఆదివాసీలు

ఆసిఫాబాద్ టికెట్‌ మర్సకోల సరస్వతికే ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. సంప్రదాయ డప్పులు, కొమ్ములు, డోలుతో నినాదాలు చేస్తూ గాంధీ భవన్‌ మెట్ల మీద నిరసన తెలిపారు. ఆదివాసీలకు ఇవ్వకుంటే కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్‌లో కొత్త కొట్లాట.. ఆసిఫాబాద్‌ టికెట్ కోసం లంబాడాలు వర్సెస్ ఆదివాసీలు
X

అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే బీసీ, కమ్మ, ఉద్యమకారుల డిమాండ్లతో కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. తాజాగా ఆసిఫాబాద్‌ సీటు కోసం లంబాడాలు, ఆదివాసీలు నువ్వా, నేనా అన్నట్లుగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్‌కు చేరుకున్న ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఆసిఫాబాద్ టికెట్‌ మర్సకోల సరస్వతికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సంప్రదాయ డప్పులు, కొమ్ములు, డోలుతో నినాదాలు చేస్తూ గాంధీ భవన్‌ మెట్ల మీద నిరసన తెలిపారు. ఆసిఫాబాద్‌ టికెట్ ఆదివాసీలకు ఇవ్వకుంటే కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఆసిఫాబాద్‌ టికెట్‌ కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యాం నాయక్‌తో పాటు, రాథోడ్ గణేష్‌, రాథోడ్‌ శేషారావు లంబాడాలు పోటీ పడుతున్నారు. అయితే వీళ్లంతా స్థానికులు కాదంటున్నారు ఆదివాసీలు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో లంబాడాల జనాభా కేవలం 17 వేలు మించదంటున్నారు ఆదివాసీలు. ఆసిఫాబాద్ టికెట్‌ ఆదివాసీలకే ఇవ్వాలంటున్నారు.

అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును కాదని.. కోవా లక్ష్మికి టికెట్ కేటాయించింది. ఇక కాంగ్రెస్‌ నుంచి టికెట్ డిమాండ్ చేస్తున్న మర్సకోలా సరస్వతి, కోవా లక్ష్మి స్వయానా అక్కాచెల్లెళ్లు కావడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికే ఆసిఫాబాద్‌ టికెట్‌ కోసం సరస్వతి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.


First Published:  11 Oct 2023 3:22 PM IST
Next Story