Telugu Global
Telangana

ఆసియాలో మొట్టమొదటి ఈ-వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్.. రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభం

లీడ్ ప్లాటినం రేటింగ్‌తో ఆసియాలోనే మొట్టమొదటి యూనిట్ హైదరాబాద్‌‌కు చెందిన రీ సస్టైనబిలిటీ అనే సంస్థ అమెరికాకు చెందిన రెల్‌డాన్‌తో కలిసి ఏర్పాటు చేస్తోంది.

ఆసియాలో మొట్టమొదటి ఈ-వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్.. రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభం
X

హైదరాబాద్‌లో మరో భారీ యూనిట్ ప్రారంభం కానున్నది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ-వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్‌ను రీసైక్లింగ్ చేయడానికి అనేక సంస్థలు యూనిట్లు పలుచోట్ల ప్రారంభిస్తున్నాయి. పర్యావరణానికి ఎలాంటి హానీ జరుగకుండా.. అత్యంత జాగ్రత్తగా ఈ-వేస్ట్‌ను యూనిట్లలో రీసైక్లింగ్ చేస్తారు. అలాంటి యూనిట్ ఒకటి జూన్ నుంచి హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. దుండిగల్‌లో ఏర్పాటు చేయనున్న ఈ-వేస్ట్ యూనిట్ ఆసియాలోనే అతి పెద్దదిగా అవతరించనున్నది.

లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్ (లీడ్) సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి యూనిట్స్‌కు రేటింగ్స్ ఇస్తుంది. లీడ్ ప్లాటినం రేటింగ్‌తో ఆసియాలోనే మొట్టమొదటి యూనిట్ హైదరాబాద్‌‌కు చెందిన రీ సస్టైనబిలిటీ అనే సంస్థ అమెరికాకు చెందిన రెల్‌డాన్‌తో కలిసి ఏర్పాటు చేస్తోంది. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఈ యూనిట్‌లో రీ సస్టైనబిలిటీకి 51 శాతం, రెల్‌డాన్‌కు 49 శాతం వాటా ఉన్నది. ఈ జాయింట్ వెంచర్‌కు రీ సస్టైనబిలిటీ రెల్‌డాన్ రిఫైనింగ్ లిమిటెడ్ అనే పేరు పెట్టారు. ఈ ఇంటిగ్రేట్ యూనిట్‌ కోసం దశల వారీగా రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. తొలిదశలో రూ.100 కోట్ల వ్యయంతో యూనిట్ నిర్మించారు.

ఏడాదికి 20వేల టన్నుల ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ యూనిట్‌ను దుండిగల్‌లో 13.6 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పారు. ఇక్కడ ఈ-వేస్ట్, ఇండస్ట్రియల్ స్క్రాప్ ప్రాసెసింగ్, విలువైన మెటల్స్ రికవరీ జరుగుతుందని కంపెనీ సీఈవో మన్సూర్ మాలిక్ తెలిపారు. జూన్ మొదటి వారంలో ఈ యూనిట్ పూర్తిస్థాయిలో ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ యూనిట్‌లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల డిస్‌మాంటిల్, ష్రెడ్డింగ్ చేస్తారు. చిప్స్ కూడా ప్రాసెసింగ్ చేస్తారు. ఈ క్రమంలో వీటిలో వాడిన బంగారం, నికెల్, పల్లాడియం వంటి విలువైన మెటల్స్‌ను రికవరీ చేస్తారు. దీంతో పాటు ఫార్మా, పెట్రోకెమికల్స్ రంగం నుంచి వచ్చే స్క్రాప్‌ను కూడా రీ-సైకిల్ చేసే అవకాశం ఉన్నది.

ఇండియాలో దాదాపు 80 శాతం ఈ-వేస్ట్ ఎటు పోతోందో ఎవరికీ తెలియదు. పాడైన కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చెత్తలో పడేస్తుండటంతో.. వాటి ద్వారా పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతోంది. కొంత మంది చిన్న యూనిట్లను ఏర్పాటు చేసి ఈ-వేస్ట్‌ నుంచి పీసీబీలు, చిప్స్ వంటివి వేరు చేసి బెల్జియం, జర్మనీ వంటి దేశాలకు పంపిస్తున్నారు. అక్కడే అత్యంత విలువైన మెటల్స్‌ను వాళ్లు రికవరీ చేసుకుంటున్నారు. కానీ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా.. విలువైన మెటల్స్ ఇక్కడే రికవరీ చేస్తారు. దీని వల్ల బంగారం, నికెల్, పల్లాడియంను సేకరించే వీలుంటుంది.

నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ చుట్టుపక్కల అనధికారికంగా 3వేల సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ-వేస్ట్‌ను సేకరించి.. వాటి నుంచి పీసీబీలు, చిప్స్ ఇతర దేశాలకు పంపిస్తున్నాయి. దీని వల్ల పర్యావరణానికి హాని జరగడమే కాకుండా.. మనకు విలువైన మెటల్స్ సేకరించే అవకాశం లేకుండా పోతోంది. ఈ కారణాల వల్లే తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఈ-వేస్ట్ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పామని మాలిక్ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ ఎకానమిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుతోంది. అందుకే హైదరాబాద్‌ను తమ ఛాయిస్‌గా ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు.

First Published:  15 April 2023 8:29 AM IST
Next Story