అక్కడ బీఆర్ఎస్ కి ఓటు వేయండి.. ఎంఐఎం పిలుపు
ఎంఐఎం పోటీ చేయని చోట్ల మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశముంది. అయితే అసదుద్దీన్ మాత్రం ఆ పొరపాటు చేయొద్దని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలకు ఓట్లు వేయొద్దని, బీఆర్ఎస్ కి వేయాలని చెప్పారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతం అని చెప్పిన ఎంఐఎం.. ఇప్పుడు ఓటు కూడా ఆ పార్టీకే వేయండి అని చెబుతోంది. అయితే అన్ని నియోజకవర్గాల్లో కాదు, ఎంఐఎం నిలబడని చోట తమ పార్టీ అభిమానులు బీఆర్ఎస్ ని బలపరచాలని సూచించారు అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పారు.
అసద్ లాజిక్..
అసెంబ్లీలో ఎంఐఎంకి ఏడు స్థానాలున్నాయి. ఈసారి కూడా ఈ ఏడు స్థానాల్లోనే బలమైన అభ్యర్థులను నిలబెట్టే అవకాశముంది. అవసరాన్నిబట్టి మరికొన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీకి నిలబడుతుంది. తాము పోటీ చేయని స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ కి ఓటువేయండి అని అసదుద్దీన్ చెప్పడం ఇక్కడ కీలకం. బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ అభివృద్ధికి ఎంతో సహకరించిందని అంటున్నారాయన. మైనార్టీ స్కాలర్ షిప్ లు, శ్మశాన వాటికల కోసం 125 ఎకరాల స్థలాలు, పాతబస్తీలో ఐటీ టవర్, మైనార్టీ లోన్లు ఇవన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనసుకు నిదర్శనమని చెప్పారు. అందుకే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటున్నారు అసద్.
ఎంఐఎం పోటీ చేయని చోట్ల మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశముంది. అయితే అసదుద్దీన్ మాత్రం ఆ పొరపాటు చేయొద్దని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలకు ఓట్లు వేయొద్దని, బీఆర్ఎస్ కి వేయాలని చెప్పారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని ఆకాంక్షించారు.