Telugu Global
Telangana

కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌కి ఛాన్స్‌.. - కేసీఆర్‌ నాయకత్వం వహించాలంటున్న ఓవైసీ

దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెబుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.. ముస్లింల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఓవైసీ ప్రశ్నించారు.

కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌కి ఛాన్స్‌.. - కేసీఆర్‌ నాయకత్వం వహించాలంటున్న ఓవైసీ
X

ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌కే బలమైన అవకాశాలున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ఇంగ్లిష్‌ ఛానల్‌తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఈ తృతీయ ఫ్రంట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అధికార, ప్రతిపక్ష కూటముల్లో ప్రాంతీయంగా పట్టున్న చాలా పార్టీలు భాగస్వాములుగా లేవని ఈ సందర్భంగా ఓవైసీ గుర్తుచేశారు. ఆ జాబితాలో మాయావతి, కేసీఆర్‌ కూడా ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఈ విషయంలో చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నానని ఓవైసీ చెప్పారు.

దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెబుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.. ముస్లింల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఓవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఈ విషయాన్ని పార్లమెంటులో తాను లేవనెత్తానని గుర్తుచేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మైనారిటీలకు కాంగ్రెస్‌ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్నారని అసదుద్దీన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉందని చెప్పారు. ఓ పక్క కశ్మీర్‌ లో ఎన్‌ కౌంటర్లు జరుగుతున్న సమయంలో ప్రపంచకప్‌ లో భారత్‌ క్రికెట్‌ జట్టు పాక్‌ తో తలపడటంపై కేంద్రంలోని బీజేపీని ఆయన తప్పుపట్టారు. మనం ఓ సైనికుడిని, కల్నల్‌ను, మేజర్‌ను కోల్పోయామని గుర్తుచేశారు. ఈ సమయంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే భిన్నంగా స్పందించేదని ఆయన చెప్పారు.

First Published:  17 Sept 2023 2:15 PM
Next Story