Telugu Global
Telangana

యూనీఫామ్ సివిల్ కోడ్‌పై అసదుద్దీన్ మండిపాటు

గుజరాత్‌లో మరోసారి అధికారంలోకి రావడానికే బీజేపీ ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేసిందని ఓవైసీ అన్నారు.

యూనీఫామ్ సివిల్ కోడ్‌పై అసదుద్దీన్ మండిపాటు
X

గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్న వేళ.. అక్కడి బీజేపీ వివాదాస్పద ప్రకటన చేసింది. తాము మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యూనీఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే దేశంలో హిందూ, ముస్లిం మతాల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన మరింత విభేదాలు సృష్టించేలా ఉన్నది. ఓకే దేశం, ఒకే భాష అంటూ కొన్నాళ్లుగా బీజేపీ జపం చేస్తున్నది. ఈ క్రమంలో కొన్ని వర్గాల వారి హక్కులను హరించేలా యూనీఫామ్ సివిల్ కోడ్‌కు తెరలేపింది. దీనిపై మొదటి నుంచి మైనార్టీ వర్గాలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నాయి. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా యూసీసీపై మండిపడ్డారు.

గుజరాత్‌లో మరోసారి అధికారంలోకి రావడానికే బీజేపీ ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేసిందని అన్నారు. ఈ ప్రకటన తనకు ఆశ్చర్యం కలిగించలేదని.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తూనే ఉంటుందని ఓవైసీ అన్నారు. వాళ్లు దీనితో ఆగరని.. ఇకపై మరింత చేస్తారని చెప్పారు. బీజేపీ నిజమైన సమస్యలు, దాని పరిష్కారాలపై మాట్లాడదని.. ఎప్పుడూ వివాదాలు సృష్టించాలనే చూస్తుందని ఓవైసీ విమర్శించారు.

కోవిడ్ సమయంలో గుజరాత్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అక్కడ వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఆక్సిజన్ కోసం, బెడ్ల కోసం ఎంతో మంది రోగులు పడరాని పాట్లు పడ్డారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం భారీగా పెరిగిందని.. ఇవన్నీ బీజేపీ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారనున్నాయి. అందుకే ఇప్పుడు కొత్తగా యూనీఫామ్ సివిల్ కోడ్ అని రాగం అందుకుందని ఓవైసీ చెప్పారు.

యూసీసీని గిరిజన ప్రజలు ఎలా అంగీకరిస్తారు? వాళ్లకు కూడా రాజ్యంగం కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. అలాగే చాలా వర్గాలకు అనేక హక్కులు ఉన్నాయి. వీటిని తీసేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆయా వర్గాలకు చెందిన బీజేపీ నాయకులు మాత్రం దీనికి అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇండియాలో యూసీసీ అవసరం లేదని లా కమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. అయినా సరే బలవంతంగా బీజేపీ దీన్ని రుద్దాలని ప్రయత్నం చేస్తోందని ఓవైసీ అన్నారు.

First Published:  30 Oct 2022 9:29 AM GMT
Next Story