తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటరు.. చెరిపేయడం రేవంత్ తరం కాదు
దీక్ష దివస్ లో మాజీ మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారని.. ఆయన ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్ తరం కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివస్ లో ఆయన మాట్లాడారు. నవంబర్ 29న అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైళ్లో మూడు రోజులు నిర్బంధించిన ఆనవాళ్లు.. డిసెంబర్ 9 నాటి రాష్ట్ర ప్రకటన.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం.. ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావ్ రేవంత్ అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. జై తెలంగాణ అన్న వారిపైకి తుపాకీ పట్టుకొని బయలుదేరిన నీ మరకను చెరపలేవు.. అది ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుందన్నారు. కేసిఆర్ కీర్తిని నీవు తుడిచేయలేవు.. తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటారని అన్నారు. లగచర్లలో గిరిజనులు కొట్టిన దెబ్బకు ఫార్మా కంపెనీని రద్దు చేసుకున్నాడని.. ఆ ప్రభుత్వంపై కొత్త ఉత్సాహంతో అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీలాంటి పార్టీలతో జై తెలంగాణ అనిపించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని బీజేపీ, యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణను చేర్చి కాంగ్రెస్ మోసం చేశాయన్నారు. ఆ పార్టీలన్ని ఓట్ల కోసమే జై తెలంగాణ అని మాటమార్చాయన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరికిని పార్టీ కాపాడుకుంటుందన్నారు. దొంగలను మళ్లీ పార్టీలో చేర్చుకోబోమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశారని అన్నారు.
తెలంగాణ సాధనపై కేసీఆర్ కు ఉన్న కమిట్‌మెంట్ ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ 'ద కోయిల్యూషన్ ఇయర్' పుస్తకంలో గొప్పగా చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పి ఇబ్బందులు పెట్టిందని, వంద కోట్ల మంది ఒప్పుకుంటేనే తెలంగాణ ఇస్తామని అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి అన్నారని.. తెలంగాణ ఇవ్వడం అంటే అదేమన్న బిర్యానీనా, సిగరెట్టా అని అవహేళన చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ అంటే కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశామన్నారు. నవంబర్ 29న కేసీఆర్ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారని, రెండు వేల మంది పోలీసులు దీక్ష శిబిరాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే ఎముకలు కొరికే చలిలో వేలాది మందికి శిబిరాన్ని కాపాడుకున్నామని చెప్పారు. కేసీఆర్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, నాయిని నర్సింహారెడ్డి, రాజయ్య యాదవ్ ను ఖమ్మం జైళ్లో పెట్టారని, తనతో సహా వందలాది మంది కార్యకర్తలను కొట్టి మెదక్ జైలులో నిర్బంధించారని తెలిపారు. కేసీఆర్ కు ఏదైనా అయితే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని భయపడే ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలతో అడ్డుకునే కుట్ర చేశారని, కేంద్రం వెనక్కి తగ్గితే తెలంగాణలో మళ్లీ ఉద్యమం మొదలైందన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేద్దామంటూ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వెన్ను చూపి పారిపోయాడన్నారు.