కీచక ఎస్‌ఐపై వేటు– శాశ్వతంగా విధుల నుంచి తొలగింపు
మంగళవారం రాత్రి 1.30 గంటల సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ అడిషనల్ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని కరీంనగర్ జైలుకు తరలించారు.
మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడిన కాళేశ్వరం ఎస్‌ఐ భవానీ సేన్‌పై వేటు పడింది. గతంలోనూ మహిళలను లైంగికంగా వేధించిన ఘటనలు ఉండడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. అతడిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్‌ఐగా ఉన్న భవానీ సేన్ ఉదంతంపై జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎస్టీపీవో సంపత్ రావుతో విచారణ చేయించారు. ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, భారీ బందోబస్తు మధ్య ఈ విచారణ చేసినట్టు సమాచారం. ఎస్‌ఐ భవానీ సేన్ వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మంగళవారం రాత్రి 1.30 గంటల సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ అడిషనల్ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని కరీంనగర్ జైలుకు తరలించారు.
భవానీ సేన్ 2022 జూలైలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్‌ఐగా ఉన్న సమయంలోనూ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడ కూడా కేసు నమోదైంది. అప్పట్లో అతడిని సస్పెండ్ చేశారు. గతంలో మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపై కూడా లైంగిక దాడులకు పాల్పడినట్టు అతనిపై ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం భవానీ సేన్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించినట్టు మల్టీజోన్–1 ఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.