Telugu Global
Telangana

తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు..రోగుల అవస్థలు

తెలంగాణలో ఆదివారం ఉదయం ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి.

తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు..రోగుల అవస్థలు
X

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆస్పత్రుల యజమాన్యం సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రాణాపాయస్థితిలో రోగులు అవస్థలు పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం కోసం లక్షలు ఖర్చవుతాయి. అందుకే పేద, మధ్యతరగతి రోగులకు ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. అలాంటి ప్రభుత్వ స్కీంను ప్రైవేట్ ఆస్పత్రులు విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వారికి రూ.వెయ్యి కోట్లకు మేర ఆరోగ్య శ్రీ బకాయిలు రావాల్సి ఉన్నదని తెలుస్తోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమై ఆరోగ్య శ్రీ నిధుల విడుదలపై చర్చించారు.

నేటికి ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసినట్లు ఆస్పత్రుల యజమాన్యం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర సర్కార్ సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్లు చేయడానికి ప్రైవేటు ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. గత్యంతరం లేక చేస్తే.. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ కాకుండా అదనంగా డబ్బులు వసూలు చేస్తూ, అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రభుత్వం నుంచి అందించే ఆపరేషన్‌ సామగ్రి నాసిరకంగా ఉంటున్నాయని, అదనంగా డబ్బులు చెల్లిస్తే నాణ్యమైన పరికరాలు వేస్తామని చెబుతున్నాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  19 Jan 2025 11:44 AM IST
Next Story