Telugu Global
Telangana

భద్రాచలం విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రుల వాగ్వాదం.. అసలు నిపుణులు ఏమంటున్నారు?

అటువైపు వరద ఎక్కువగా వెళ్తోంది. ఇక కిన్నెరసాని వరదకూడా తోడైతే బూర్గంపాడు మండలం తీవ్రంగా ప్రభావితం అవుతోంది.

భద్రాచలం విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రుల వాగ్వాదం.. అసలు నిపుణులు ఏమంటున్నారు?
X

గోదావరి వరద కారణంగా భద్రాచలం పట్టణం నీట మునిగింది. ఇటీవల ఎన్నడూ రానంతగా 23 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 70 అడుగులు దాటింది. సాధారణంగా అంత వరద వచ్చినా.. గోదావరి వద్ద 70 అడుగుల నీటిమట్టం దాటదు. అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వద్ద డ్యాం, ఆనకట్ట పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో కొంత బ్యాక్ వాటర్ నిలిచి పోయి ఉంటోంది. నీళ్లు వేగంగా దిగువకు వెళ్లక పోవడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి రెండు మలుపులు తిరిగి ఉంటుంది. పై మలుపు కొంచెం తక్కువగాను, కింద మలుపు ఎక్కువగా ఉంటుంది. దీంతో వరద వేగంగా వచ్చినప్పుడు భద్రాచలం పట్టణంపై ప్రభావం పడుతోంది. రెండు దశాబ్దాల క్రితం భద్రాచలం వైపు ప్రభుత్వం కరకట్ట నిర్మించింది. భద్రాచలం పట్టణం స్టార్టింగ్ పాయింట్ నుంచి దిగువన గోదావరి మూల వరకు నిర్మించి వదిలేశారు. దీంతో భారీ వరదలు వచ్చినప్పుడు గోదావరి నీళ్లు కరకట్టకు తాకి మరోవైపు ఉన్న సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, బూర్గంపాడు వైపు ప్రభావం చూపిస్తోంది. అటువైపు వరద ఎక్కువగా వెళ్తోంది. ఇక కిన్నెరసాని వరదకూడా తోడైతే బూర్గంపాడు మండలం తీవ్రంగా ప్రభావితం అవుతోంది.

భద్రాచలం వైపు కరకట్ట రక్షణ లేని ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాల వైపు కూడా భారీగా వరద వస్తోంది. అటువైపు నుంచి వచ్చే వరద కారణంగా తిరిగి భద్రాచలం కూడా ఎఫెక్ట్ అవుతోంది. అందుకే అక్కడ కూడా కరకట్టలు నిర్మించాలని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కూడా చెప్పారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు విభజన సమయంలో ఏపీకి వెళ్లిపోయాయి. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో.. ఆ గ్రామాలు కూడా ఏపీలో కలిసిపోయాయి.

ఇప్పుడు గోదావరి వరదల నుంచి భద్రాచలంను పూర్తిగా రక్షించాలంటే పైన పేర్కొన్న ఐదు గ్రామాల్లో కరకట్టలు నిర్మించాల్సి ఉన్నది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉన్నా.. అవి ఏపీ పరిధిలో ఉండటం అడ్డంకిగా మారింది. రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వస్తే అక్కడ కరకట్టలు నిర్మించవచ్చు. కానీ ఆ గ్రామాలను ఇచ్చేయాలని, పోలవరం ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అనడం.. దానికి ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ ఇంకోలా స్పందించడం వివాదానికి దారి తీసింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదం కాకపోయినా.. భద్రాచలం విషయంలో తెలంగాణ అభ్యంతరాలను ఏపీ మంత్రులు సావధానంగా వినలేదనే చర్చ జరుగుతోంది.

ముంపునకు గురవుతున్న భద్రాచలం, పక్క గ్రామాలలో కరకట్టలు మాత్రమే కాకుండా.. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం కొత్త కాలనీలను కూడా నిర్మించాల్సి ఉన్నది. పోలవరం వల్ల తెలంగాణలోనే ముంపు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఇది వివాదంగా ఉండకూడదని అప్పట్లో 7 మండలాలను ఏపీలో విలీనం చేశారు. కానీ గోదావరి అవతల ఒడ్డున ఉన్న భద్రాచలం తెలంగాణలోకి.. పట్టణాన్ని ఆనునుకొని ఉన్న కాలనీలు, గ్రామాలు ఏపీలోకి వెళ్లిపోయాయి. ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. ఆయా గ్రామాల్లో ఏవైనా పనులు చేయాలంటే ఏపీ ప్రభుత్వం మాత్రమే చేయాలి. వరద నుంచి రక్షణ చర్యలు ఏపీ మాత్రమే తీసుకోవాలి. అక్కడకు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కట్టడాలు నిర్మించలేదు.

కాబట్టి ఇరు రాష్ట్రాలు ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చి రక్షణాత్మక నిర్మాణాలు చేపడితేనే ముంపు నుంచి భద్రాచలం, ఇతర గ్రామాలను కాపాడవచ్చిని నిపుణులు చెప్తున్నారు. అటువైపు మాత్రమే కాకుండా సారపాక, బూర్గంపాడు వైపు కూడా కరకట్టల నిర్మాణం వేగంగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

First Published:  20 July 2022 4:01 AM
Next Story