ప్రజాపాలన అని ఈ నిర్బంధాలు ఏమిటి
గ్రూప్ -1 అభ్యర్థులతో సీఎం చర్చించి సమస్య పరిష్కరించాలి : కేటీఆర్
ప్రజాపాలన అని పొంకనాలు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ -1 అభ్యర్థులపై ఇంతటి నిర్బంధాన్ని ప్రయోగించడం ఏమిటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనలపై శనివారం ఆయన స్పందించారు. జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రేవంత్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. కేసీఆర్ తీసుకువచ్చిన 95 శాతం లోకల్ రిజర్వేషన్‌లను తుంగలో తొక్కారన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు కాకుండా వికీపీడియాను ప్రమాణికం తీసుకున్నామని టీజీపీఎస్సీ చెప్పడం బాధకరమన్నారు. నాలుగు రోజులుగా గ్రూప్ -1 అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. అశోక్ నగర్ వెళ్లి కాంగ్రెస్ ను గెలిపించిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగుల ఆందోళనకు కనీసం సమాధానం కూడా చెప్పడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి వారిని పిలిపించి మాట్లాడాలన్నారు. వాళ్లు కోరుతున్నట్టుగా గ్రూప్ -1 మెయిన్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలన్నారు. అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన తమ పార్టీ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ అరెస్ట్ దారుణమన్నారు. విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ముందుకు రాని సీఎం.. తన దోస్త్ బండి సంజయ్ తో ఏం చర్చలు జరుపుతాడని మండిపడ్డారు. ఇకనైనా శిఖండి రాజకీయాలు మాని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పిలిచి చర్చలు జరపాలన్నారు.