కామెడీ షోలంటే ఇంత భయమా ?
ఈరోజు హైదరాబాద్ లో జరిగిన మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షోను అడ్డుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నం చేసింది. ఓ కామెడీ షో అంటే వాళ్ళెందుకు ఇంతగా భయపడుతున్నారు ? దాడులతో విమర్శలను అడ్డుకోవాలనే ప్రయత్నం ఎప్పుడైనా విజయవంతం అవుతుందా ?
వాళ్ళకు నిజమంటే భయం...సత్యం అంటే వెన్నులో వణుకు పుడుతుంది.... ఫేక్ న్యూస్ ప్రచారం చేసే దిట్టలకు అసలు నిజాలు చెప్పేవాళ్ళంటే కోపం, ఆక్రోషం. నిజాలు బైటపెట్టే కార్టూన్ లన్నా, కామెడీ షో లన్నా వాళ్ళకు ద్వేషం.... అందుకే ఓ బక్కపల్చని యువకుడి పై కక్షగట్టారు. దాడులు చేస్తామంటు బెదిరించారు. గొంతు నొక్కేస్తామంటూ వీరంగమాడుతున్నారు.
మునావర్ ఫరూఖీ... ఈ పేరు ఇప్పుడు బీజేపీ నాయకులను హడలెత్తిస్తుంది. ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ కు చెందిన ఫరూఖీ చేతుల్లో ఆయుధాలేమీ ఉండవు, హింస రెచ్చగొట్టడు, హింసకు పాల్పడడు...ఆయన బాంబులు పంచడు, భావాలు పంచుతాడు... అది కూడా కామెడీ షోలతో ఆయన చెప్పదల్చుకున్న నిజాలను నిర్భయంగా చెప్తాడు. ప్రధానంగా ఆయన రాజకీయ నాయకులమీద వ్యంగ్యాలు సంధిస్తాడు... తన సున్నితమైన వ్యంగ్యంతో అసత్యాలతో రాజ్యమేలే రాజకీయ నాయకులను చీల్చి చెండాడుతాడు. ముఖ్యంగా మోడీ, అమిత్ షా, బీజేపీ నాయకులపై, వాట్సప్ ప్రచారాలపై ఆయన వ్యంగ్య విమర్శలు గుప్పిస్తాడు. అలాగని విపక్షాల పట్ల ఆయనేమీ సాఫ్ట్ గా ఉండడు. రాహుల్ గాంధీ మీద కూడా అయన జోకులేస్తాడు. ఇతర విపక్షాలపై కూడా విమర్శలు చేస్తాడు. మిగతావాళ్ళంతా ఫరూఖీ విమర్శలను తేలిగ్గా తీసుకుంటే బీజెపి నాయకులకు, వాట్సప్ యూనివర్సిటీ స్కాలర్లకు మాత్రం ఆయనంటే అస్సలునచ్చదు. అందుకే బెదిరింపులు, దాడులు, అరెస్టులు....
2021జనవరిలో మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగిన కామెడీ షోలో మునావర్ ఫారూఖీ అమిత్ షా మీద విమర్శలు చేసినందుకు ఆయనను అరెస్టు చేశారు. అతని పై బీజేపీ నాయకులు, హిందుత్వ గ్రూపులు అనేక కేసులు పెట్టాయి. అనేక సార్లు హత్యా బెదిరింపులు వచ్చాయి. అనేక సార్లు షోలను క్యాన్సెల్ చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఫరూఖీ కామెడీ షోలను జరగనివ్వలేదు.
ఇప్పుడిక తెలంగాణ వంతు. బీజేపీ ప్రభుత్వాలు ఆయన షోలను రద్దు చేసినప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మునావర్ ఫరూఖీని ఆహ్వానించారు. ''హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ షో చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోరు'' అని హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఇవ్వాళ్ళ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మునావర్ ఫరూఖీ స్టాండప్ కామెడీ షో ఏర్పాటయ్యింది. అయితే యధావిధిగా అంతట చేసినట్టే హైదరాబాద్ లో కూడా ఆ షోను అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఫారూఖీపై దాడులు చేస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు చేశాడు. షోను ఆపడానికి మునావర్ పై దాడులు చేయడానికి ఈ రోజు శిల్పకళా వేదిక వద్దకు అనేక మంది విడుతలు విడుతలుగా బీజేపీ కార్యకర్తలు వచ్చారు. అల్లరి సృష్టించే ప్ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉండటంతో వాళ్ళ ఆటలు సాగలేదు. వాళ్ళను పోలీసులు అడ్డుకోవడంతో ఆక్రోషంతో జై శ్రీరాం అనే నిదాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. ఇక హౌజ్ అరెస్టయిన రాజా సింగ్ అయితే తమ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులతో, తాము అధికారంలోకి రాగానే బాత్ రూం లు కడిగిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
విమర్శలను, వ్యంగ్య విమర్శలను, హాస్యాన్ని, ద్వేషంతో, హింసతో, దౌర్జన్యంతో గెలువాలనుకున్న వాళ్ళెవరైన విజయవంతమైన చరిత్ర ప్రపంచలో ఉందా ?