కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ.. సేఫ్ గేమ్ ఆడుతున్నారా?
దూకుడుగా వెళుతున్న బండి సంజయ్‌ని అకస్మాత్తుగా అధ్యక్ష పదవి నుంచి దింపేయడం, అసెంబ్లీ టికెట్ల వ్యవహారంలో నాన్చుడు ధోరణి.. ఇవన్నీ బీజేపీకి ఇక్కడ సీన్ లేదని ఆ పార్టీయే ఒప్పుకున్నట్లు చేశాయి.
రాష్ట్రంలో ఉన్న బీజేపీ అగ్రనాయకులంతా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి.. ఇదీ ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశం. ఆ ఆదేశాలకు తగ్గట్లే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు అసెంబ్లీ బరిలోకి దిగారు. కానీ, ఇంకో ఎంపీ, కేంద్ర మంత్రి కూడా అయిన కిషన్ రెడ్డి ఎందుకు శాసనసభకు పోటీ చేయట్లేదు..? ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాటేంటి..? గద్వాల జేజమ్మ, సీనియర్ నేత డీకే అరుణ ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారు..? రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న ఎవరికైనా వచ్చే ప్రశ్నలివి.. వీటన్నింటికీ ఒకటే సమాధానం.. జస్ట్ సేఫ్ గేమ్
ఎంపీ స్థానానికైతే ఆ ఊపు వేరు
రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఫైట్ నడుస్తోంది. బీజేపీ గత రెండేళ్లుగా చూపించిన బలం అంతా బలం కాదని వాపు అని తేలిపోయింది. దూకుడుగా వెళుతున్న బండి సంజయ్‌ని అకస్మాత్తుగా అధ్యక్ష పదవి నుంచి దింపేయడం, అసెంబ్లీ టికెట్ల వ్యవహారంలో నాన్చుడు ధోరణి.. ఇవన్నీ బీజేపీకి ఇక్కడ సీన్ లేదని ఆ పార్టీయే ఒప్పుకున్నట్లు చేశాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ బరిలోకి దిగి పరాభవం పాలవడం కంటే ఇప్పటికి ఊరుకుని, లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగూ టికెట్లు ఇస్తారు కాబట్టి పోటీచేయొచ్చనేది కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, అరుణ తదితరుల వ్యూహం. లోక్‌సభకి అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి ఉండే ఊపు వేరు. దానికి తోడు ఎన్డీయే మిత్రపక్షాల సపోర్ట్ ఉంటుంది. కాస్త అదృష్టం తోడైతే ఎంపీగా గెలవచ్చు. ఇంకా సుడి బాగుంటే కేంద్ర మంత్రీ కావచ్చని వాళ్ల లెక్క అంటున్నారు.
గత ఎన్నికల ఫలితాలను చూసి..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో ఓడిపోయారు. బండి సంజయ్ కరీంనగర్‌లో 14 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. కానీ ఆర్నెల్లు తిరక్కముందే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి కిషన్‌రెడ్డి 60 వేల ఓట్ల తేడాతో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. తర్వాత కేంద్ర మంత్రి పదవీ వరించింది. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాని సంజయ్ 85 వేల ఓట్ల తేడాతో కరీంనగర్‌లో ఎంపీ అయిపోయారు. అదంతా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీదున్న పాజిటివ్ వైబ్‌తోనే సాధ్యమైంది. ఈసారీ అలాగే వెళ్లొచ్చని వ్యూహంతో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, అరుణ లాంటి నేతలు సేఫ్ గేమ్ ఆడుతున్నారు.