తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు.. ఎందుకంటే.?
ప్రస్తుతం తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వాయువ్యం వైపు ఉండగా.. ఈశాన్యం వైపు మరో గేటును సిద్ధం చేస్తున్నారు. వాయువ్యం వైపు నుంచి రాకపోకలు మంచి కాదని వాస్తు నిపుణులు చెప్పినట్లు సమాచారం.
బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. దీంతో వాస్తుదోషం కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని గులాబీ బాస్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా ఆఫీసులోకి వెళ్లే ప్రధానమైన గేటు మార్పు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వాయువ్యం వైపు ఉండగా.. ఈశాన్యం వైపు మరో గేటును సిద్ధం చేస్తున్నారు. వాయువ్యం వైపు నుంచి రాకపోకలు మంచి కాదని వాస్తు నిపుణులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈశాన్యం వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రత్యేకంగా ర్యాంపు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ భవన్‌కు వీధిపోటు ఉండడంతో.. ఆ ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు మార్పులు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రాంగణం లోపల కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.
BRS Party headquarters Telangana Bhavan to get ‘Vaastu’ makeover
— Sudhakar Udumula (@sudhakarudumula) April 5, 2024
This is followed by the party's recent defeat in Assembly elections and a large number of defections.
Following the directions of Bharat Rashtra Samithi Supremo KCR who is known to be a firm believer of Vaastu,… pic.twitter.com/knCMLltrN8
ఇక BRS చీఫ్ కేసీఆర్ వాస్తును బలంగా నమ్ముతారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. సెక్రటేరియట్‌ను పెద్దగా సందర్శించలేదు. సెక్రటేరియట్ బిల్డింగ్ వాస్తుకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. పదేళ్ల పాటు అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ నుంచే కార్యకలాపాలు కొనసాగించారు. ఇక 2015లో వాస్తు కన్సల్టెంట్ సుద్దాల సుధాకర్ తేజను ప్రభుత్వ ఆర్కిటెక్చర్ సలహాదారుగా నియమించారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెయ్యి కోట్లతో కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించింది బీఆర్ఎస్ సర్కార్.